సిఎం కేజ్రీ వెంట భార్య సునీత, పార్టీ సీనియర్ నేతలు
న్యూఢిల్లీ : తీహార్ జైలులో నుంచి విడుదలైన మరునాడు శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ భగవాన్ హనుమాన్ ఆశీస్సులు తీసుకున్నారు. ‘అన్యాయంపై నా పోరు’ సమయంలో హనుమంతుడి ఆశీస్సులు తనతోనే ఉన్నాయని కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ తన భార్య సునీత కేజ్రీవాల్‌తో కలసి కన్నాట్‌ప్లేస్‌లోని ప్రముఖ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, అందరి సంక్షేమం, సౌభాగ్యం కోసం భగవంతుని ఆశీస్సులు కోరారు. ఆలయ పూజారి ఢిల్లీ సిఎంకు సింధూరంతో స్వాగతం పలికి, బజరంగ్ బలి గదను, పవిత్రమైన ముక్కోణ పతాకాన్ని బహూకరించారు.
పార్టీ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆయన వెంట ఉన్నారు. కేజ్రీవాల్ తన భార్యతో కలసి ధ్యానం చేసి, తరువాత శివలింగానికి అభిషేకం చేశారు. ఆయన తన పర్యటన వీడియోను ‘ఎక్స్’లో పంచుకున్నారు. ‘నా భార్య సునీతా కేజ్రీవాల్, ఇతర సహచరులతో కలసి కన్నాట్‌ప్లేస్‌లోని పురాతన హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, భగవాన్ హనుమాన్‌ను అర్చించి, ఆయన ఆశీస్సులు పొందాను. అన్యాయంపై ఈ పోరులో భగవాన్ హనుమాన్ ఆశీస్సులు సదా నాతోనే ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఆనందం, సౌభాగ్యం కోసం భగవంతుని ప్రార్థించాను. దేశాన్ని కాపాడేందుకు ఈ పోరులో మనందరిలో ఈ ధైర్యాన్ని భగవంతుడు కొనసాగించుగాక’అని కేజ్రీవాల్ తన పోస్ట్‌లో రాశారు.