న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో నేడు ఢిల్లీ కోర్టు సీఎం కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీకి పంపింది. స్పెషల్ జడ్జి కావేరి బవేజా .. రౌజ్ అవెన్యూ కోర్టులో ఆ ఆదేశాలు ఇచ్చారు. అయితే నేడు అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు కోర్టులో ప్రత్యేక అప్లికేషన్ దాఖలు చేశారు. మూడు పుస్తకాలు చదువుకునేందుకు కేజ్రీవాల్‌కు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలు కేజ్రీవాల్ చదువుకుంటారని ఆయన తరపున న్యాయవాదులు కోర్టులో తెలిపారు.
ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్‌కు వెళ్లిన కేజ్రీవాల్ మరో 15 రోజుల పాటు జైల్లోనే ఉండనున్నారు. ఆ సమయంలో బహుశా ఆయన ఈ పుస్తకాలు చదువుతారో ఏమో అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. మద్యం పాలసీ కేసుతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన నిందితుడు అని ఈడీ ఆరోపిస్తున్నది. ఆయన్ను మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. హౌ ప్రైమ్‌మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాన్ని జర్నలిస్టు నీరజ్ చౌదరీ రాశారు. ప్రధానులు ఎలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారో ఆ పుస్తకంలో ఆయన విశదపరిచారు.