Sunday, January 19, 2025

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ వైభవ్ కుమార్‌పై ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ వేటు పడింది. గురువారం ఆయనను విధుల నుంచి తొలగిస్తూ విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. వైభవ్ కుమార్‌పై నమోదైన కేసు, తాత్కాలిక నియామకానికి సంబంధించి సెంట్రల్ సివిల్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి నియమించినందుకు ఆయన విధులను రద్దు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

2007లో తన విధులు నిర్వహించకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడటంతో వైభవ్‌కుమార్‌తోపాటు మరో ముగ్గురిపై నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీలో పనిచేసే మహేష్ పాల్ అనే ప్రభుత్వ అధికారి కేసు నమోదు చేశారు. దీంతో పోలీస్‌లు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిపాలన పరమైన చర్యలో భాగంగా సిఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీగా వైభవ్ కుమార్‌ను తొలగించారు.

కేజ్రీవాల్‌కు పీఎస్‌గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాప్తులో తేలింది. “ ఈ నియామకంలో అవకతవకలు జరిగాయి. పాలనా వ్యవహారాల పరంగా ఇది ఇబ్బందికర పరిణామం. ఎలాంటి ముందస్తు వెరిఫికేషన్ లేకుండా పూర్వాపరాలను సరిచూడకుండా మంత్రుల వ్యక్తిగత సిబ్బందిని నియమించడం సరికాదు. వైభవ్‌పై నమోదైన అభియోగాలు తీవ్రమైనవి. వాటిపై విచారణ జరుగుతోంది. ఆ వివరాలను పరిగణన లోకి తీసుకోకుండా పీఎస్‌గా నియమించారు” అని విజిలెన్స్ విభాగం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం వైభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. అదే విధంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద వైభవ్ కుమార్ వద్ద స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు ఈడీ పేర్కొంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనపై వేటు వేయడం గమనార్హం. ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పార్టీని సమూలంగా నాశనం చేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని బీజేపీపై ధ్వజమెత్తింది. “మొదట తప్పుడు కేసులో సీఎంను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి సహా కేజ్రీవాల్ సిబ్బంది మొత్తాన్ని తొలగించే పని మొదలు పెట్టారు. ఆప్‌ను నాశనం చేయడమే బీజేపీ ఏకైక లక్షమని మరోసారి స్పష్టమైంది” అని ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News