న్యూస్ డెస్క్: విస్కీ సీసాల్లో కొకైన్‌ను కలిపేసి స్మగ్లింగ్ చేస్తున్న ఒక 25 ఏళ్ల కెన్యా యువతిని ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టడ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కొకైన్ విలువ రూ. 13 కోట్లు ఉంటుంది.
ఇథియోపియాలోని అడ్డీస్ అబాబా నుంచి ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆ యువతిని కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా రెండు విస్కీ సీసాల్లో కలిపేసిన కొకైన్‌ను కనుగొన్నారు. దాని విలువ రూ. 13 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారి ఒకరు తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేసి కొకైన్ కిలిపిన విస్కీ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ అధికారి చెప్పారు.
ఈ రెండు విస్కీ సీసాలు ఆమెకు నైరోబీ విమానాశ్రయంలో చేతికి అందాయి. ఢిల్లీలో ఆమె వీటిని ఒక వ్యక్తికి అప్పగించాల్సి ఉందని అధికారి తెలిపారు. నిందితురాలిని స్థానిక కోర్టులో హాజరుపరచగా ఆమెకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు.