టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది జాడ కోసం కేరళ నుంచి రప్పించిన కెడావర్ డాగ్స్
ఎస్‌ఎల్‌బిసిని సందర్శించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సహాయక చర్యలపై సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నివేదిక
మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు మరింత ముమ్మరమయ్యాయి.13 రోజులుగా నిరంతరాయంగా 11 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సింగరేణి కార్మికులు, ఆర్మి, నేవితో పాటు హైవే బోర్డర్ సెక్యూరిటటీ ఫోర్స్ సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కన్వేయర్ బెల్ట్ మరమ్మత్తులు పూర్తి అయిన అది పూర్తి స్థాయిలో సొరంగం కూలిన ప్రదేశం వరకు లేకపోవడంతో మట్టిని ఎత్తిపోసే ప్రక్రియ కాస్త మందగించింది. టిబిఎం వరకు కన్వేయర్ బెల్ట్‌ను ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాల అంచనాకు వచ్చి కొత్తగా టన్నెల్‌లో పిల్లర్స్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. కన్వేయర్ బెల్ట్ సంఘటన స్థలం వరకు పొడిగిస్తే తప్ప పూర్తి స్థాయిలో మట్టిని, ఇతర వ్యర్థాలను తొలగించడం సాధ్యం కాదు. లోకో ట్రైన్ ద్వారా లోడింగ్ చేసుకుని కన్వేయర్ బెల్ట్ వరకు అన్‌లోడ్ చేసి తిరిగి ఆ బెల్ట్‌లో కూలీల సహాయంతో వ్యర్థాలను పోస్తే 13 కిలోమీటర్ల బయటికి మట్టి, బురద తరలించడం జరుగుతుంది.
దీనికి తోడు రాడార్ సైతం సొరంగంలో చిక్కుకున్న వారిని గుర్తించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. రాడార్ అందించిన సిగ్నల్స్ ఆధారంగా తవ్వకాలు చేపడితే కన్వేయర్ బెల్ట్ ముక్కలు, ఇతర వ్యర్థాలు బయటపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేరళ నుంచి గురువారం సొరంగంలో చిక్కుకున్న వారిని గుర్తించడానికి క్యాడవర్ డాగ్స్‌ను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రప్పించారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన మినిస్ట్రి ఫర్ హోమ్ ఆఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటి సెక్రటరి కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ సందర్శించి సొరంగంలో చిక్కుకున్న వారి సహాయక చర్యల గురించి అధికారులు సహాయక బృందాల ప్రతినిధులతో పాటు ఏజెన్సీలతో చర్చించారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యల 13వ రోజు గురువారం కేంద్రం నుంచి విచ్చేసిన మినిస్త్రీ ఫర్ హోమ్ అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటి సెక్రటరి కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పర్యవేక్షించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ టన్నెల్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. టన్నెల్ లోపల 13వేల 650 కిలోమీటర్ల ప్రాంతంలో టన్నెల్ బోర్ మిషన్‌పై రాళ్లు, మట్టి పడి దాదాపు 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్ బోర్ మిషన్ పూర్తిగా ధ్వంసమైందని,
అందులోనే 8 మంది ఇరుక్కు పోయి ఉన్నట్లు వివరించారు. నీరు రావడం, మట్టి, రాళ్లతో కలిసి పోయిందన్నారు. ప్రస్తుతం టిబిఎంను కొద్ది కొద్దిగా కట్ చేస్తూ ముందుకు కార్మికులను అన్వేషిస్తున్నట్లు వివరించారు. కార్మికులను గుర్తించడానికి కేరళ నుండి క్యాడవర్ డాగ్స్‌లను రప్పించినట్లు వివరించారు. కన్వేయర్ బెల్ట్ సైతం పనిచేయడం ప్రారంభమయ్యింది. మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తీయించే ప్రక్రియ మొదలైతే సహాయక చర్యలు వేగవంతం అవుతుందన్నారు. అనంతరం టన్నెల్ లోపల ఉన్న ప్రస్తుత పరిస్థితులు, కొనసాగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్ స్కాడ్‌తో కలిసి సాయంత్రం టన్నెల్‌లోకి బయల్దేరి వెళ్లారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పి వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, డోగ్ర రెజిమెంట్ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్‌డిఆర్‌ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, జయ ప్రకాష్, అసొసియేట్ ఎండి పంకజ్ గౌర్ తదితరులు ఉన్నారు.