కొల్లాం : కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ రెండు రోజుల క్రితం కొజికోడ్ లోని ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్లారు. చాలా బిజీగా ఉండే వీధిలో ఆయన పబ్లిక్‌తో నేరుగా మాట్లాడుతూ వాకింగ్ చేశారు. ఈ ఘటనపై సీఎం విజయన్ స్పందించారు. నవ కేరళ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కోజికోడ్ లోని ఎస్‌ఎం వీధిలో గవర్నర్ ఆరిఫ్ నడుచుకుంటూ వెళ్లిన తీరును సీఎం విజయన్ ఖండించారు.
ముందస్తు సమాచారం లేకుండా ఆయన వాకింగ్ చేశారని, భద్రతను కూడా గవర్నర్ విస్మరించారని తప్పు పట్టారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం సరైన విధానం కాదన్నారు. రక్షణ వద్దని గవర్నర్ ఆరిఫ్ రాష్ట్ర పోలీస్‌లకు లేఖ రాసినా , ఆయనకు మాత్రం జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించనున్నట్టు సీఎం విజయన్ తెలిపారు. వీధుల్లో వాకింగ్ చేసి, కేరళ సురక్షితంగా ఉందని గవర్నర్ చాటారని, కానీ శాంతి భద్రతల గురించి ఈ విధంగా ప్రచారం చేయడం సరికాదన్నారు.