పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ వ్యతిరేకం, పౌరుల హక్కులకు వ్యతిరేకమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఇది భారత దేశ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ విజయన్ విలేఖరులతో మాట్లాడుతూ,ఈ వివాదాస్పద చట్టం మత వివక్షకు చట్టబద్ధతను మంజూరు చేస్తుందని విమర్శించారు. అంతేకాదు సిఎఎకు వ్యతిరేకంగా ఏర్పడిన ఐక్యఫ్రంట్‌నుంచి కాంగ్రెస్ వైదొలగిందని కూడా ఆయన ఆరోపించారు.2019లో పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా లభించింది.
అయితే పలు కారణాల వల్ల అప్పటినుంచి అమలు కాకుండా ఉన్న ఈ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు అమలు చేయనున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలు ప్రతిపక్ష పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీన్ని అముల చేయబోమని తృణమూల్ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా అసోం సహా అనేక ప్రాంతాల్లో దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.