తిరువనంతపురం : కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లామిక్ స్టేట్ లో చేరారన్న అబద్ధాన్ని కథాంశంగా రెచ్చగొడుతూ కేవలం సంఘ్ పరివార్ ప్రచారం కోసమే “ది కేరళ స్టోరీ ” సినిమా రూపొందించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. దర్యాప్తు సంస్థలు, కోర్టులు, కేంద్ర హోం మంత్రి కూడా కేరళలో లవ్‌జిహాదీ అన్నది లేదని చెప్పినా బుద్ధి పూర్వకంగా రాష్ట్రంలో విద్వేషపూరిత ప్రచారం కోసం ఈ సినిమాను ఉపయోగించుకుంటున్నారని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.
Also Read: నాణ్యమైన విద్యపై మోడీని ప్రశ్నించిన యునెస్కో చీఫ్..
భావప్రకటన స్వేచ్ఛ అనేది దేశాన్ని వర్గీకరించడానికి, ప్రజలను విభజించడానికి లైసెన్స్ కాదని వ్యాఖ్యానించారు. సంఘ్ పరివార్ మతసామరస్యాన్ని నాశనం చేయడానికి సమాజంలో విషబీజాలు నాటడానికి ప్రయత్నిస్తోందని, అలాంటి ప్రయత్నాలు కేరళలో సాగబోవని హెచ్చరించారు. మళయాళీలు అలాంటి సినిమాను తిరస్కరిస్తారని పేర్కొన్నారు. ఇదే విధంగా విపక్షం కాంగ్రెస్ కూడా ఈ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వరాదని ప్రభుత్వాన్ని కోరింది.