న్యూఢిల్లీ : కేరళలోని కాంగ్రెస్ నాయకులు ‘ఒక్కటై నిలుస్తారు’ అని, ముందు ఉన్న లక్షం వారిని ‘సమైక్యం’ చేస్తున్నదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ వ్యూహం, ముందుకు సాగవలసిన విధం గురించి మేధోమథన సమావేశం కోసం ఢిల్లీ వచ్చిన కేరళ నాయకులతో ‘ఇందిరా భవన్’లో భేటీ అయిన అనంతరం రాహుల్ ఆ స్పష్టీకరణ ఇచ్చారు. సమావేశం అనంతరం కేరళ నాయకుల మీడియా గోష్ఠి నుంచి ఒక చిత్రాన్ని రాహుల్ ‘ఫేస్‌బుక్’లో పోస్ట్ చేస్తూ, ‘వారు ఒక్కటిగా నిలుస్తారు, ముందు ఉన్న లక్షం అనే కాంతితో సమైక్యంగా ఉంటారు’ అని పేర్కొన్నారు.
ఆయన పోస్ట్‌కు ‘టీమ్ కేరళ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో సుమారు మూడు గంటల సేపు రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ, సమైక్యత, బలోపేతం చేయడం ఇతివృత్తంగా ఆ సమావేశం సాగింది. పార్టీ నాయకులు రాజకీయ వ్యూహం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలని, పార్టీ వైఖరికి భిన్నంగా ఏదీ చేయరాదని, మాట్లాడరాదని సమావేశంలో రాహుల్ ఉద్బోధించినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని కూడా చర్చించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్ఠానం తమ నాయకులు అందరికీ కఠిన హెచ్చరిక చేసింది. పార్టీ వైఖరికి విరుద్ధంగా ప్రకటనలు చేసేవారిపై కఠినమైన క్రమశిక్షణ చర్య తీసుకోగలమని అధిష్ఠానం హెచ్చరించింది.
ప్రధాని నరేంద్ర మోడీని పార్టీ తిరునంతపురం ఎంపి శశి థరూర్ ప్రశంసించిన, కాంగ్రెస్‌కు తన సేవలు అక్కరలేని పక్షంలో తనకు ‘ఇతర మార్గాలు’ ఉన్నాయని ఆయన సున్నిత హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. శశి థరూర్ ఇంతకు ముందు కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ విధానాలు కొన్నిటిని కూడా కొనియాడారు. ప్రధాని మోడీ జనవరిలో వాషింగ్టన్‌ను సందర్శించి, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కావడాన్ని థరూర్ స్వాగతించారు. అయితే, మోడీ యుఎస్ పర్యటనపై కాంగ్రెస్ నిశిత విమర్శలు చేసిన విషయం విదితమే.
పార్టీలో తనను పక్కన పెట్టారని థరూర్ అసంతుష్టితో ఉన్న దృష్టా రాహుల్ గాంధీ ఒక వారం క్రితం ఢిల్లీలో ఆయనతో జనాంతిక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ కేరళ శాఖలో క్రమశిక్షణ, సమైక్యత పరిరక్షణ గురించి నొక్కిచెప్పారు. ఈ సమావేశానికి ఖర్గే, రాహుల్‌తో పాటు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, వయనాడ్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా, కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె సుధాకరన్, సిఎల్‌పి నేత విడి సతీశన్, తిరువనంతపురం ఎంపి శశి థరూర్, ఎఐసిసి కేరళ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ కూడా హాజరయ్యారు.