కొట్టాయం: నన్‌పై లైంగికదాడి కేసులో రోమన్ కేథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కేరళలోని ఓ కోర్టు నిర్దోషిగా తేల్చింది. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బిషప్‌పై ఓ నన్ ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన కొట్టాయంలోని అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు2 శుక్రవారం తీర్పు వెల్లడించింది. కొట్టాయం జిల్లాలోని ఓ కాన్వెంట్‌లో పని చేసే నన్ తనపై ములక్కల్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. రోమన్ కేథలిక్ చర్చికి చెందిన జలంధర్ డయోసీస్‌కు బిషప్‌గా ఉన్న సమయంలో ములక్కల్ 201416 మధ్య తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని నన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 జూన్‌లో ములక్కల్‌పై కేసు నమోదైంది. 2019 నవంబర్‌లో కోర్టు విచారణ ప్రారంభమైంది. ఈ నెల 10న విచారణ పూర్తయింది.
బిషప్‌పై ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఆయన తరఫు న్యాయవాది వ్యాఖ్యానించారు. తీర్పు వెల్లడైన సమయంలో కోర్టుహాల్‌లో ఉన్న ములక్కల్ ఆనందభాష్పాలు రాల్చారు. అరుపులు, కేకలతో ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేశారు. తీర్పుపై మీడియా పలుమార్లు ప్రశ్నించగా దేవుని స్తోత్రం అంటూ ఒకే మాటను బిషప్ వల్లెవేశారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించిన సీనియర్ ఐపిఎస్ అధికారి ఎస్.హరిశంకర్ మాట్లాడుతూ కోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. తీర్పుపై ఉన్నతస్థాయి న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కేసులో నూటికి నూరుపాళ్లూ నేరం రుజువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.