Friday, November 22, 2024

కేరళ ‘కరెన్సీ స్మగ్లింగ్’!

- Advertisement -
- Advertisement -

Kerala 'Currency Smuggling'!

 

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రోద్బలంతో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కస్టమ్స్ విభాగం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసిన సమయం గమనించదగినది. అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో ఉన్నాయనగా వెల్లడైన ఈ సమాచారం ప్రభావం వాటి ఫలితాలపై ఏ మేరకు ఉంటుందో చూడాలి. కరెన్సీ స్మగ్లింగ్‌కు మూలంలో ఉన్న దౌత్య రక్షణ మార్గాల ద్వారా దుబాయ్ నుంచి బంగారం దొంగ రవాణా కేసు కేరళను కుదిపేయడం ప్రారంభించి ఎనిమిది మాసాలు దాటింది. ఇంత కాలం ప్రస్తావనకు రాని ఈ అంశం ఒక్కసారిగా ఇప్పుడే ఎందుకు బద్దలైంది అనేది ప్రధానమైన ప్రశ్న. రాజకీయం ఇంతగా వేడెక్కని ఇతర రోజుల్లోనైతే ఇటువంటి ఆరోపణల పట్ల ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతారు. దర్యాప్తు క్షుణ్ణంగా జరిగి అసలు నిజాలు బయటికి వచ్చి తీరాలని ఆశిస్తారు. ఆ కేసుకు కూడా న్యాయం జరుగుతుంది. ఎంతటి వారైనా దోషులని తేలితే వారి రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురమైపోతుంది. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కస్టమ్స్ విభాగం హైకోర్టుకు చెప్పిందంటూ వార్తల్లో వచ్చిన విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ ఉదంతానికి రాజకీయ స్వప్రయోజక కాండ అనే మసి అంటుకునే అవకాశముంది.

మూలంలో ఉన్న బంగారం స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన స్వప్న సురేశ్ అనే మహిళ చెప్పిన సమాచారమంటూ కస్టమ్స్ విభాగం దీనిని హైకోర్టు దృష్టికి తీసుకు రావడం విశేషం. తాము స్వయంగా దర్యాప్తు చేసి తగిన సాక్షాధారాలతో నిగ్గు తేల్చిన అంశంగా వారు చెప్పలేదు. కాకపోతే రూఢి అయిన సమాచారంగా పేర్కొన్నారు. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దౌత్య కార్యాలయం ఆర్థిక వ్యవహారాల అధికారి సహకారంతో ఇక్కడి నుంచి అక్కడికి రూ. కోటి 30 లక్షల విలువైన డాలర్లను దొంగ రవాణా చేశారన్నది అభియోగం. దీని వెనుక ముఖ్యమంత్రి విజయన్, అసెంబ్లీ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్, ముగ్గురు మంత్రుల హస్తమున్నదని అందులో ఆరోపించారు. వీరి ప్రోద్బలంతోనే కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని స్వప్న సురేశ్ స్పష్టమైన సమాచారమిచ్చినట్టు కస్టమ్స్ పేర్కొన్నది. ఈ నెల 12వ తేదీలోగా తమ కార్యాలయంలో హాజరు కావాలని స్పీకర్‌కు కస్టమ్స్ కమిషనరేట్ నోటీసు కూడా ఇచ్చింది.

ఈ విషయాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు బిజెపి కూడా ఎన్నికల ఆయుధంగా వాడుకోడం ప్రారంభించాయి. రూ. 15 కోట్ల విలువైన బంగారాన్ని దౌత్య కార్యాలయ పార్శిల్లో తరలిస్తుండగా తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడిన ఉదంతం గత ఏడాది జులై 5న జరిగింది. ఖర్జూరం, ఆహారం ప్యాకెట్లు, బాత్రూం ఫిటింగ్స్, ఎలెక్ట్రానిక్ పరికరాల వంటి వాటితో కూడిన పార్శిల్ తిరువనంతపురంలోని దుబాయ్ కాన్సులేట్ జనరల్ అష్మియా పేరుతో ఆ రోజు దుబాయ్ నుంచి వచ్చింది. దౌత్య కార్యాలయాలకు వచ్చే పార్శిళ్లను తనిఖీ చేయించకుండానే విమానాశ్రయాల్లో అనుమతిస్తారు. కాని నిఘా వర్గాలు ఉప్పందించడంతో ఈ పార్శిల్‌ను కస్టమ్స్ అధికార్లు తనిఖీ చేశారు. అందులో 30.25 కిలోల బంగారం లభించింది. దానితో ఆ బంగారం అసలు గమ్యం విషయంలో లోతైన దర్యాప్తు ప్రారంభమైంది. కేరళల్లోని పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఉగ్రవాద లక్షణాలున్న సంస్థ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం కోసం ఈ బంగారాన్ని పంపించి ఉంటారనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఆరా తీయడం ప్రారంభించింది.

ఇంకొక వైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), కస్టమ్స్ విభాగం కూడా విచారణ చేపట్టాయి. పర్యవసానంగా 30 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో యుఎఇ కాన్సులేట్ ఉదోగిని స్వప్న సురేశ్ , ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయ అప్పటి ముఖ్య కార్యదర్శి శివశంకర్ కూడా ఉన్నారు. తన అభ్యర్థన మేరకు శివశంకర్ కస్టమ్స్ విభాగాన్ని కోరినందు వల్ల అనేక సార్లు ఇటువంటి బంగారం పార్శిళ్లను తనిఖీ లేకుండా వదిలి పెట్టారని స్వప్న సురేశ్ దర్యాప్తులో చెప్పినట్టు వార్తల్లో వచ్చింది. అయితే ఈ కేసు మూలాలు ఎంత దూరానికి పాకినవైనప్పటికీ వాటిని కనుక్కొని ఛేదించి తీరవలసిందే.

దానికి గల దేశ భద్రతపరమైన ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, బంగారం సగ్లింగ్ కోసం దౌత్యపరమైన ప్రత్యేక రక్షణలను కూడా దుర్వినియోగం చేస్తున్నారన్న కోణంలోనూ దర్యాప్తు లోతుగా సాగి అసలు దోషులను బయటకు లాగవలసిందే. అయితే స్థానిక ఎన్నికల్లో ఊహించని విజయాలు సాధించి కేరళ చరిత్రలోనే మొదటిసారిగా వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని భావిస్తున్న వామపక్ష కూటమి ముఖ్యమంత్రిని అప్రతిష్ఠ పాలు చేయడానికే కరెన్సీ స్మగ్లింగ్‌లో ఆయన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతున్నదనే మాటే నిజమైతే మన రాజకీయాల పతనావస్థకు అంతకంటే మించిన నిదర్శనం ఇంకొకటి ఉండదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News