Monday, January 20, 2025

కేరళలో నిఫా కలకలం..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: అత్యంత ప్రమాదకర నిఫా వైరస్‌తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో నివారణ చర్యలకు అధికారులు ఉపక్రమించారు. 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడి బ్యాంకులు, పాఠశాలలతో పాటు ఇతర విద్యాసంస్థలను మూసివేశారు. ఈ నేపథ్యంలో పుణె లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపుణులు కేరళకు వస్తున్నారని, నిఫా పరీక్షల కోసం గబ్బిలాలపై సర్వే నిర్వహించడానికి వీలుగా కొజికోడ్ మెడికల్ కాలేజీలో మొబైల్ ల్యాబ్ ఏర్పాటవుతుందని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రకటించింది. కొజికోడ్ జిల్లాలో నలుగురికి నిఫా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం బయటపడిన నిఫా కేసు బంగ్లాదేశ్ వేరియంట్ అని ,ఇది మనుషుల మధ్య వ్యాపిస్తుందని, వ్యాప్తి తక్కువగా ఉన్నా మరణాల రేటు మాత్రం అధికంగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీనాజార్జ్ వెల్లడించారు. పుణె నుంచి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపుణుల బృందంతోపాటు చెన్నై నుంచి ఎపిడెమియోలాజిస్టుల బృందం కూడా సర్వే చేపట్టడానికి కేరళకు వస్తారని మంత్రి తెలిపారు.

ఇంకా అదనంగా నిఫా రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన మోనోక్లోనల్ యాంటీబాడీలను తీసుకురాడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్) అంగీకరించిందని చెప్పారు. ( మోనోక్లోనల్ యాంటీబాడీ అనేది ఒక ప్రత్యేకమైన తెల్లరక్త కణాన్ని క్లోనింగ్ చేయడం ద్వారా తయారు చేయబడిన కణజాలం నుంచి ఉత్పత్తి అయ్యే యాంటీబాడీ . కొవిడ్ వంటి అనేక వ్యాధుల నిర్ధారణకు, చికిత్సకు వీటిని ఉపయోగిస్తారు). నిఫా వైరస్ నివారణ చర్యలపై సిపిఐ ఎమ్‌ఎల్‌ఎ పి. బాలచంద్రన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ సర్వే, బాధితులతో అతిసన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడం, తక్కువ, ఎక్కువ రిస్కు ఉన్న వారిని వర్గీకరించడం, బాధితులను వేరుగా ఉంచడానికి ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించడం, ఐసిఎంఆర్ నుంచి ఔషధాలను సమకూర్చుకోవడం, తదితర చర్యలను కొన్నిటిని తక్షణం ప్రారంభించినట్టు మంత్రి వివరించారు. అయితే నిఫా వైరస్‌కు సంబంధించి కొత్త చికిత్స నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉందని అసెంబ్లీ లోని విపక్షాల నాయకుడు విడి సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేశ్ చెన్నితాల సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిఫా వైరస్ గురించి హెచ్చరించిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేక పోయిందని సతీశన్ విమర్శించారు. ఆరోగ్యసిబ్బందిలో చాలా మందికి వైరస్ చికిత్సకు సంబంధించి సరైన శిక్షణ లేదన్నారు. అలాగే భవిష్యత్తులో దీన్ని గట్టిగా ఎదుర్కోడానికి వీలుగా డేటా సేకరణ జరగలేదని ఆరోపించారు. దీనికి మంత్రి స్పందిస్తూ రాష్ట్రంలో ఈమేరకు నిఫా వైరస్ పరీక్షకు, నిర్ధారణకు రెండు ల్యాబ్‌లు ఉన్నాయని, తొనక్కల్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ వైరాలజీ ఒకటి కాగా, మరొకటి కొజికోడ్ మెడికల్ కాలేజీ అని వివరించారు. అయితే ఈ వైరస్ గురించి ముందుగా ప్రకటించడానికి తమకు అనుమతి లేదని పుణె లోని ఎన్‌ఐవికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు. ఈ రెండు ల్యాబ్‌ల్లో వైరస్ గురించి ప్రకటించడానికి అనుమతి పొందడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తొనక్కల్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ వైరాలజీ సామర్థాలను ప్రశంసించారు.

అయితే వైరస్ శాంపిల్స్ ఎందుకు అక్కడకు పంపించడం లేదో పరిశీలిస్తామన్నారు. మంత్రి వీనాజార్జ్ దీనిపై వివరిస్తూ మొదట నీఫా వైరస్ బయటపడినప్పుడు 2018లో చికిత్సకు సంబంధించిన ప్రొటోకాల్స్ జారీ అయ్యాయని, తరువాత 2021లో అవి అభివృద్ధి చెందాయని చెప్పారు. ఇప్పటికీ వాటినే అనుసరిస్తున్నట్టు తెలిపారు.

కంటైన్‌మెంట్ జోన్లుగా ఏడు పంచాయతీలు
కొజికోడ్ జిల్లాలో అటన్‌చెరీ, మరుతొనకర, తిరువల్లూరు. కుట్టియడి, కయక్కోడి, విల్లిపల్లి, కవిలుంపారా, తదితర ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ జిల్లాలో మంగళవారం నిఫా వైరస్ కేసులు నిర్ధారణ కాగానే ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజయన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News