జెరుసలెం: ఇజ్రేలీ నమూనా వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఫిబ్రవరిలో కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇజ్రేల్‌ను సదర్శించిన ఒక 48 ఏళ్ల కేరళ రైతు అక్కడే అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఇజ్రేలీ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నూర్ జిల్లాలోని ఉలిక్కళ్ పంచాయతికి చెందిన రైతు బిజూ కరురియన్ ఇజ్రేల్‌ను సందర్శించిన 28 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఉన్నారు. బిందు సేద్యం వంటి ఇజ్రేలీ సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి కేరళ ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందాన్ని అక్కడకు పంపించింది. ఫిబ్రవరి 17న కురియన్ అదృశ్యమయ్యారు. ఆయన ఆచూకీ కోసం ఇజ్రేలీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటివరకు ఆయన వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆయన లభించిన వెంటనే ఇండియాకు పంపించివేస్తామని ఒక అధికారి తెలిపారు.
ఇలా ఉండగా.. ఇజ్రేల్‌లో మాయమైన రైతు కురియన్ కేరళలోని తన కుటుంబ సభ్యులకు ఆదివారం మధ్యాహ్నం ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో స్థిరపడాలన్న ఉద్దేశంతోనే తాను కనిపించకుండా పోయినట్లు అతను తన కుటుంబానికి తెలియచేసినట్లు తెలిసింది. తాను సురక్షితంగా ఉన్నానని, తన కోసం వెదకవద్దని కూడా అతను తన భార్యకు చెప్పినట్లు తెలుస్తోంది.