ఎస్‌ఎఫ్‌ఐ నల్లజెండాల ప్రదర్శన, దాడిపై ఆగ్రహం
ముఖ్యమంత్రి విజయన్ తీరుపై విపక్షాల ధ్వజం
ఎస్‌ఎఫ్‌ఐ నిరసనను సమర్థించిన మంత్రులు
గవర్నర్ చర్యలపై నిరసన కొనసాగిస్తాం : ఎస్‌ఎఫ్‌ఐ వెల్లడి
తిరువనంతపురం : కేరల ముఖ్యమంత్రి పినరయి విజయన్ తనపై భౌతిక దాడి చేయించి గాయపరిచేందుకు కుట్ర పన్నారని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ పర్యటన కోసం తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు గవర్నర్ వెళ్తుండగా ఆయన వాహనాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల వాహనాలు ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తరువాత కారు నుంచి కోపంగా బయటకు వచ్చిన గవర్నర్ ఈ దాడి వెనుక సిఎం విజయన్ కుట్ర ఉందని ఆరోపించడం సంచలనం కలిగించింది.
అధికార పార్టీ సిపిఎంకు చెందిన విద్యార్థి విభాగమే ఎస్‌ఎఫ్‌ఐ. “ ఒకవేళ ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుంటే మధ్యలో వేరే వాళ్ల కార్లు రావడానికి అనుమతిస్తారా ? సిఎం కారు సమీపం లోకి మరో కారును రానిస్తారా ? కానీ నా విషయంలో ఏం జరిగింది ? నా కాన్వాయ్ వెళ్లే దారిలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు కార్లలో వచ్చి నల్లజెండాలు ప్రదర్శించారు. నా కారును ఇరువైపులా చుట్టుముట్టి వారి కార్లతో ఢీకొన్నారు. ఇదంతా జరుగుతుండగా, పోలీస్‌లు వారిని కార్ల లోపలికి నెట్టేశారు. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు.
ఇలా చేయించింది కచ్చితంగా సీఎం విజయనే. గూండాలను పంపి నాపై దాడికి కుట్ర పన్నారు. తిరువనంతపురం రోడ్లు గుండాల అధీనం లోకి వెళ్లాయి. ఒక వేళ సీఎం నాతో విభేదించాలనుకుంటే విభేదించవచ్చు. నాపై దాడి చేయాల్సిన అవసరం లేదు. కేరళలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్ప కూలాయి” అని గవర్నర్ ఖాన్ తన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ సమాచారం ప్రకారం… మూడుచోట్ల నిరసనకారులు గవర్నర్ కారును అడ్డుకుని నల్లజెండాలు ప్రదర్శించారు. రెండు చోట్ల గవర్నర్‌కారును ఢీకొన్నారు. కానీ పోలీస్‌లు మాత్రం ఎస్‌ఎఫ్‌ఐ నిరసన కారులు ఒక్క చోట మాత్రమే గవర్నర్ వాహనాన్ని అడ్డుకున్నారని, నిరసనకారుల్లో ఏడుగురిని అరెస్ట్ చేయడమైందని వివరించారు.
సిఎంపై విపక్షాల ఆరోపణ
ఈ దాడి వెనుక సిఎం విజయన్ ఉన్నారని విపక్షాలు కాంగ్రెస్, యుడిఎఫ్, బిజేపీ ఆరోపించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని విమర్శించాయి. ఇలాంటి సంఘటన జరగడం రాష్ట్ర చరిత్రలో మొదటిదని, ఎస్‌ఎఫ్‌ఐ నిరసనకారులు హత్యకు ప్రయత్నించడాన్ని విపక్షనేత విడి సతీశన్ ప్రశ్నించారు. ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలీస్‌ల ఉదాసీనత వల్లనే ఈ దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధినేత కె. సురేంద్రన్ ఆరోపించారు.
ఇటీవల సుప్రీం కోర్టు గవర్నర్ వైఖరిపై తీర్పు వచ్చిన తరువాత వామపక్షపార్టీ గవర్నర్‌పై దాడికి పాల్పడిందని ఆరోపించారు. సీనియర్ బీజేపీ నేత , కేంద్ర మంత్రి వి. మురళీధరన్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సంఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని నిరూపిస్తున్నట్టు విమర్శించారు. గత కొన్నివారాలుగా కేరళ సిఎం, ఆ పార్టీ కార్యదర్శి గవర్నర్‌ను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనే ఆదివారం వజుతకాడ్ వద్ద జరిగింది. గవర్నర్ ఒక కార్యక్రమానికి వెళ్తుండగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించారు.
గవర్నర్‌కు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తాం : ఎస్‌ఎఫ్‌ఐ
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను కాషాయీకరణం చేయడానికి గవర్నర్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని, అందువల్ల ఆయన చర్యలకు నిరసనగా తాము ఆందోళన కొనసాగిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి పిఎం ఆర్షో స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేపథ్యం కలిగిన వారిని కేరళ, కాలికట్ విశ్వవిద్యాలయాల్లో నియమిస్తున్నారని ఆరోపించారు. దేశం మొత్తం మీద ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ ఎజెండాయే యూనివర్శిటీల్లో అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎస్‌ఎఫ్‌ఐ కి మంత్రుల మద్దతు
గవర్నర్ ఖాన్‌పై ఎస్‌ఎఫ్‌ఐదాడి చేయడాన్ని మంత్రులు పి. రాజీవ్, ఎకె శశిధరన్, విఎ మొహమ్మద్ రియాస్ సమర్థించారు. ఎస్‌ఎఫ్‌ఐని కాంగ్రెస్ విమర్శించడాన్ని వారు తప్ప పట్టారు. విపక్షనేత విడి సతీశన్ బీజేపీ రాజకీయాలను చేస్తున్నారని విమర్శించారు.
18 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల అరెస్ట్
గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేయడం, కారును ఢీకొనడం తదితర సంఘటనలపై పోలీస్‌లు 18 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.