Sunday, December 22, 2024

గవర్నర్ల సమాంతర పాలన!

- Advertisement -
- Advertisement -

Parallel rule of governors! గవర్నర్లు మంత్రులను తొలగించగలరా? ఒక మంత్రిని తొలగించాలంటూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ముఖ్యమంత్రిని కోరడం సంచలనం సృష్టించింది. బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల గవర్నర్లు రానురాను సమాంతర పాలకులు అయిపోతున్నారు. బిల్లులను నిరవధికంగా తమ వద్ద వుంచుకొని పాలనకు ఆటంకాలు కలిగిస్తున్నారు. విశ్వవిద్యాలయాల నిర్వహణలో మితిమించి జోక్యం చేసుకొంటున్నారు. బిజెపియేతర రాష్ట్రాల గవర్నర్లు మాత్రమే ఇటువంటి అప్రతిష్ఠాకరమైన ప్రవర్తనకు తరచూ పాల్పడుతున్నారు. అంటే తాము కేంద్ర పాలకుల ఏజెంట్లు మాత్రమేనని వారిని మెప్పించడానికి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, వారి ప్రభుత్వాలను ముప్పితిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడమే తమ కర్తవ్యమని వీరు భావిస్తున్నట్టున్నారు. తాము ప్రజలెన్నుకున్న గవర్నర్లు కాదు అని గ్రహించడం లేదు. ప్రజలెన్నుకున్న రాష్ట్ర మంత్రి వర్గాల సలహా మేరకే తాము పని చేయాల్సి వుంటుందనే రాజ్యాంగ పరిమితిని గుర్తించడం లేదు.

ముఖ్యమంత్రులకు శాసన సభలో మెజారిటీ వున్నంత కాలం వారి సలహాలు పాటిస్తూ, వారికి తోడ్పడడమే మంచి గవర్నర్ లక్షణమని వీరికి ఎవరు చెప్పాలి? మంత్రులను తొలగించే స్వతంత్రాధికారం తనకున్నదని కేరళ గవర్నర్ చెప్పడం రాజ్‌భవన్‌ల అతిక్రమణ పర్వంలో పరాకాష్ఠ. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక కమిటీ సభ్యుల నియామక నిబంధనలను మారుస్తూ గత సెప్టెంబర్‌లో కేరళ శాసన సభ ఆమోదించిన ఒక బిల్లు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరొక సారి తీవ్ర విభేదాలు తలెత్తినట్టు తెలుస్తున్నది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాల గోపాల్ కేరళ విశ్వవిద్యాలయ సభలో ఇటీవల మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని యూనివర్శిటీలతో ఎక్కువ పరిచయమున్న వారు కేరళ వర్శిటీల ప్రజాస్వామిక శైలిని అర్థం చేసుకోలేరని గవర్నర్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్య చేశారు. దీనితో మండిపడిన గవర్నర్ ఆ మంత్రి తన ఆమోదాన్ని కోల్పోయారని ప్రకటించారు. అతనిని మంత్రి పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు. సిఎం పినరయి విజయన్ దీనిని తిరస్కరించారు, తీవ్రంగా ఖండించారు. మంత్రులను నియమించడం, తొలగించడం కేవలం ముఖ్యమంత్రికే పరిమితమైన రాజ్యాంగ అధికారమని ఆయన గవర్నర్‌కు స్పష్టం చేశారు.

మంత్రి బాలగోపాల్ కేరళ విశ్వవిద్యాలయంలో చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టేవిగా వున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఇది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తన ద్వారా బాలగోపాల్ చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించడమేనని అన్నారు.వాస్తవానికి రాజ్యాంగం 164 అధికరణ ప్రకారం ముఖ్యమంత్రిని, సిఎం సిఫార్సు మేరకు మంత్రులను గవర్నరే నియమిస్తారు. గవర్నర్ సంతృప్తి, ఆమోదానికి లోబడి మంత్రులు కొనసాగుతారు. అయితే ఇది మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కు ఎంత మాత్రం కట్టబెట్టదు. గవర్నర్ సంతృప్తి, ఆమోదం అనేవి స్వతంత్రమైనవి కావు. అవి ప్రజల మద్దతుతో ఏర్పడిన మంత్రి వర్గం సిఫారసుకు లోబడినవి మాత్రమే. మంత్రులను గవర్నరే నేరుగా తొలగిస్తే రాష్ట్రాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఇంక ఉనికి ఎక్కడుంటుంది? ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది. ఈ విషయాన్ని మరిచిపోయి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గీత దాటారు. మిమ్మల్ని ఎందుకు తొలగించరాదో చెప్పాలంటూ 11 విశ్వవిద్యాలయాల విసిలకు నిర్ణీత వ్యవధితో కూడుకొన్న నోటీసులను పంపించి కేరళ గవర్నర్ మరో సంచలనం సృష్టించారు. యుజిసి నియమాలకు విరుద్ధంగా నియమితులయ్యారన్న కారణం చూపి కేరళలోని మరో విశ్వవిద్యాలయం విసి నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది.

ఆ సందర్భంగా అది ఇచ్చిన తీర్పును ఆసరా చేసుకొని 11 మంది విసిలకు గవర్నర్ ఖాన్ ఈ నోటీసులు పంపించారు. బిల్లుల విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా తాత్సార తంత్రాన్ని పాటించడం బాధాకరం. తెలంగాణ శాసన సభ ఆమోదించి పంపిన 8 బిల్లులపై ఆమోద ముద్ర వేయకుండా వాటిని గవర్నర్ తమిళి సై తన వద్ద వుంచుకున్నారు. ఈ ఎనిమిది బిల్లులలో ఆరు సవరణ బిల్లులు కాగా, రెండు కొత్తవి. వీటిని ఆమోదించడం, తిరస్కరించడం తన ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుందని ఆమె ప్రకటించారు. వాస్తవానికి అసెంబ్లీ పంపిన బిల్లులన్నింటిపై ఆమోద ముద్ర వేయడం గవర్నర్ల విధి. తమకేమైనా అభ్యంతరాలుంటే వాటిని తెలియజేయాలే తప్ప బిల్లును నిరవధికంగా తమ వద్ద వుంచుకోడం రాజ్యాంగ విహితం కాదు. కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి ఆమోదానికి సిఫార్సు చేస్తూ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందికి గురి చేస్తూ వుంటారు. ప్రజలు ఎన్నుకున్న శాసన సభలు పంపించే బిల్లులను గవర్నర్లు నిరవధికంగా వుంచుకోడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. పద్ధతి తప్పినప్పుడే గవర్నర్లు ఇటువంటి నగుబాటు చర్యలకు పాల్పడుతుంటారు. వారిలో ఇప్పటికైనా విజ్ఞత కలగాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News