తిరువనంతపురం: సిపిఎం అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐకు చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ శనివారం రోడ్డు పక్కన ధర్నాకు దిగారు. కొల్లాం జిల్లాలో నిలమెల్‌లో ఈ సంఘటన జరిగింది. నిలమెల్‌లో రద్దీగా ఉండే ఎంసి రోడ్డు పక్కన ఓ షాపు నుంచి కుర్చీ తీసుకుని రోడ్డు పక్కన వేసుకుని కూర్చోవడం సంచలనం కలిగించింది. గవర్నర్ ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించి నిరసన తెలపడం గవర్నర్ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఆయన కారు దిగి దగ్గర్లోని షాపు వద్ద ధర్నా సాగించారు.
ఈ సమయంలో ఆయన పోలీస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు టివి ఛానల్స్‌లో వైరల్ కావడం ప్రారంభమైంది.. పోలీస్ అధికారులే కాకుండా గవర్నర్ ఖాన్‌కు చెందిన అధికార సిబ్బంది స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో ఆ ప్రదేశంలో గుమి కూడారు. నిరసనకారులకు రక్షణ కల్పిస్తున్నారని గవర్నర వాదించారు. 13 మంది నిరసనకారులను అరెస్ట్ చేసినట్టు పోలీస్‌లు చెప్పగా, మిగతా వారి సంగతేమిటి? అని గవర్నర్ వారిని ప్రశ్నించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ భద్రతను పెంచుతూ కేంద్ర హోం శాఖ జడ్ ప్లస్ కేటగిరి కేటాయించినట్టు కేరళ రాజ్‌భవన్ వెల్లడించింది. కేరళలో గవర్నర్ అరిఫ్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య గత కొన్నాళ్లుగా వివాదాలు ముసురుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక పోవడం, యూనివర్శిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమం లోనే తాజా సంఘటన చోటు చేసుకుంది.