తిరువనంతపురం: వరకట్నం, మహిళలపై దాడులకు నిరసనగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ బుధవారం ఒకరోజు నిరహార దీక్ష చేపట్టారు. వరకట్నం అనేది మహిళల హుందాతనాన్ని తగ్గించే చర్య అని, అది తీవ్ర అన్యాయమని దీక్షకు ఒకరోజు ముందు గవర్నర్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. పలు గాంధేయ సంస్థలు ఆరిఫ్ దీక్షకు సంఘీభావం తెలిపాయి. సామాజిక చైతన్యం కలిగించడానికే గవర్నర్ దీక్ష చేపట్టారని ఆ సంఘాలు తెలిపాయి. కేరళలోని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు కూడా గవర్నర్‌కు మద్దతు తెలిపాయి. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ బిజెపి నేత, కేంద్రమంత్రి మురళీధరన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ప్రజలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందునే గవర్నర్ దీక్ష చేపట్టాల్సివచ్చిందని కేరళ పిసిసి అధ్యక్షుడు కె.సుధాకరన్ విమర్శించారు. ఓ సామాజిక దురాచారంపై గవర్నర్ దీక్ష చేపట్టడం ఇదే మొదటిసారి అన్నది గమనార్హం. కేరళలో సిపిఐ(ఎం) ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.