కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సిఫార్సు చేయాలని తీర్మానించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రత్యేకించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కక్ష సాధింపు ధోరణులకు పాల్పడుతోందని కేరళ సర్కారు నిరసన వ్యక్తం చేసింది. బంగారం, డాలర్ స్మగ్లింగ్ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలు తమదైన రీతిలో విచారిస్తున్నాయి. ఈ క్రమంలో వీటి వ్యవహారశైలిపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై కూలంకుషంగా చర్చించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలపై న్యాయవిచారణకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తరువాత జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం ఉంది. ఈ కమిషన్ ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలపై విచారణకు వీలేర్పడుతుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కెవి మోహన్ సారధ్యంలో కమిషన్ ఏర్పాటు కానుంది. పలు కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారశైలి శృతి మించిందని, వామపక్ష, లౌకిక పార్టీల నేతలను ఏదో విధంగా అప్రతిష్ట పాలుచేసేందుకు యత్నిస్తున్నారని కేరళలోని ఎల్‌డిఎఫ్ కేంద్రంపై ఆరోపణలకు దిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ తంతు గాడీ తప్పినందున, ముందుగా వీటిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవిచారణకు చర్యలు తీసుకున్న ఘటన ఇప్పుడు కేంద్రం వర్సెస్ కేరళ మధ్య నడుస్తున్న కయ్యాన్ని మరింత తీవ్రతరం చేసింది.