Monday, December 23, 2024

కేరళ గవర్నర్‌కు షాక్.. వర్శిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సర్కార్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : విశ్వవిద్యాలయాల కులపతిగా గవర్నర్‌ను తొలగించి ఆ స్థానంలో ఓ విద్యా నిపుణుడిని నియమించేందుకు కేరళ లోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు తెలిపారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై న్యాయశాఖ తయారు చేసిన ముసాయిదా ఆర్డినెన్స్‌పై కేబినెట్ సమావేశంలో చర్చించారు. అయితే ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సంతకం పెడితేనే అమల్లోకి వస్తుంది.

దీంతో ఆయన సంతకం పెడతారా లేదా అన్నదానిపై విద్యాశాఖ మంత్రిని మీడియా ప్రశ్నించగా, గవర్నర్ తన రాజ్యాంగ బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు బిందు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాల విషయంలో విజయన్ ప్రభుత్వం , గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కేరళ లోని 9 యూనివర్శిటీల ఉప కులపతులు తక్షణమే రాజీనామా చేయాలని ఇటీవల గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి విసిల నుంచి స్పందన రాకపోవడంతో షోకాజ్ నోటీసులు అందించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం … వీరి నియామకాలు యూజీసి నిబంధనలకు అనుగుణంగా లేవన్నది ఛాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ వాదించారు.

అయితే గవర్నర్ వైఖరిని సీఎం విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగ పెద్దలు తమ హద్దులు దాటకూడదని పేర్కొన్నారు. వీసీల రాజీనామా వ్యవహారంపై ప్రస్తుతం కేరళ హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. కాగా… ఈ ఏడాది జూన్‌లో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర యూనివర్శిటీల కులపతిగా గవర్నర్‌ను తొలగించి, ఆ స్థానంలో సీఎంను నియమించేలా ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అయితే ఇంకా అది చట్ట రూపం దాల్చలేదు. మరోవైపు కర్ణాటక, తెలంగాణ లోనూ పాలక ప్రభుత్వాలకు , గవర్నర్లకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News