Saturday, December 21, 2024

నిఫా మొదటి కేసుపై కేరళ ప్రభుత్వం ఆరా

- Advertisement -
- Advertisement -

కొజికోడ్ : నిఫా మొదటి కేసుకు సంబంధించి ఆ ప్రాంతం ఎక్కడిదన్న పరిశీలనలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆ వ్యక్తి ఎలా నిఫా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడో మొబైల్ టవర్ లొకేషన్ల ద్వారా ఆరా తీస్తోంది. ఎక్కడ ఎలా ఆ వ్యక్తి బాధితుడయ్యాడో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడానికి ప్రయత్నిస్తుండగా, కేంద్ర బృందం వైరల్ ప్రభావం ఏపాటి ఉందో తెలుసుకోడానికి గబ్బిలాల నుంచి శాంపిల్స్ సేకరిస్తోందని రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీనాజార్జి వెల్లడించారు. వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించిందని తెలిపారు.

ఆరోవ్యక్తికి నిఫా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యాక, కాంటాక్ట్ ట్రేసింగ్‌ను పూర్తి చేయడంలో ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. కొత్తగా నిఫా వైరస్ పాజిటివ్ కేసులేవీ లేకపోవడం రాష్ట్రానికి పెద్ద ఊరటగా పేర్కొన్నారు. ఎక్కువ రిస్కు ఉన్న కాంటాక్టు జాబితాకు సంబంధించి 94 శాంపిల్స్‌ను పరీక్షించగా నెగిటివ్ అని తేలింది. ఈలోగా కోజికోడ్ మెడికల్ కాలేజీలో 21 మంది, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేటెర్నల్ , అండ్ ఛైల్డ్ హెల్త్ (ఐఎంసిహెచ్) లో ఇద్దరు పిల్లలు ఐసొలేషన్‌లో ఉంచినట్టు జార్జి చెప్పారు.

కొవిడ్ కంటే ప్రమాదకరం : ఐసిఎంఆర్ హెచ్చరిక
నిఫా వైరస్ కొవిడ్ కంటే ప్రమాదకరమని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) హెచ్చరించింది. కేరళలో ప్రస్తుతం ఆరు పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం నాలుగు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం తమ వద్ద 10 మంది రోగులకు సరిపడా మోనోక్లోనల్ యాంటీబాడీ మందు ఉందని, మరో 20 డోసుల మందులను ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేయనున్నట్టు ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ చెప్పారు.
ఇది బంగ్లాదేశ్ వేరియంట్
కేరళ లోని కోజికోడ్ జిల్లాలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది బంగ్లాదేశ్ వేరియంట్ అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ జిల్లా లోని ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. బ్యాంకులు, పాఠశాలలు, ఇతర కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News