కొచ్చి: కేరళ హైకోర్టు ఇటీవలి తన రెండు తీర్పులను మలయాళంలో ప్రచురించింది. తద్వారా ప్రాంతీయ భాషలో తీర్పును ప్రచురించిన దేశంలోనే తొలి హైకోర్టుగా అవతరించింది. న్యాయమూర్తులు ఎస్.మణికుమార్, షాజీతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పులను వెలువరించారు. ఈ తీర్పులను పి.చాలి జనవరిలో హైకోర్టు వెబ్‌సైట్‌లో మలయాళంలో ఉంచారు. ఇదో రికార్డు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నవంబర్ 2022లో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రాంతీయ భాషలలో హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రచురించాలంటూ కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ నుంచి సామూహిక ఒత్తిడి ఉంది.
వాస్తవానికి ఈ తీర్పులు వెలువడిన సమయంలోనే, ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులను విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమైందని భారత ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఇదే పంథాలో భారత గణతంత్ర దినోత్సవం నాడు ఒడియా, గారో, ఇతర ప్రాంతీయ భాషల్లో 1091 తీర్పులు వెలువడ్డాయి. ఇంగ్లీషు అంతగా రాని పౌరులకు సైతం అందుబాటులోకి వచ్చేలా ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువరించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు.
‘ఇటీవల ఒక కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు అందుబాటులోకి తేవాలన్న కృషి జరగాలని కోరారు. అందుకు టెక్నాలజీని కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఇదో ప్రశంసనీయ యోచన. ఇది చాలా మందికి, ప్రధానంగా యువకులకు తోడ్పడుతుంది’ అని జనవరి 22న ప్రధాని ట్వీట్ చేశారు.