Monday, December 23, 2024

విశిష్ట తీర్పు

- Advertisement -
- Advertisement -

సంప్రదాయం పురోగామి దృక్పథాన్ని కలిగి వుంటుంది అని గాని, వుండాలని గాని ఎవరూ అనుకోరు, కోరుకోరు. అయితే సంప్రదాయమనేది అనుక్షణం ముందడుగులకు అడ్డంగా నిలుస్తూ సమాజాన్ని నిలువ నీరులా వుంచడమే పనిగా వ్యవహరిస్తున్నప్పుడు అది ఎన్నో అసమానతలను పోషిస్తుంది. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మహిళలపై పరిమితులను బిగిస్తూ బిగిస్తూ వుండడమే మన దేశంలో సంప్రదాయవాదుల పని అనిపిస్తుంది. ఇటువంటి ధోరణి గల వారి చెంప చెళ్ళుమనిపిస్తూ కేరళ హైకోర్టు తాజాగా ఒక తీర్పు వెలువరించింది. వామపక్ష ప్రభుత్వం గల ఆ రాష్ట్రంలో మహిళా హక్కుల ఉద్యమకారిణి రెహనా ఫాతిమాపై ప్రాసిక్యూషన్ అశ్లీల నేరం కింద కేసు పెట్టగా హైకోర్టు న్యాయమూర్తి దానిని కొట్టివేసి ఆమెను 13 రోజుల నిర్బంధం నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ విశిష్టమైన తీర్పు ఇచ్చారు. స్త్రీ, పురుష తేడాకు ఆస్కారం లేకుండా ఎవరి శరీరం మీద వారికి పూర్తి హక్కులుంటాయని అందులో స్పష్టం చేశారు. ఫాతిమా 2020 జూన్‌లో ‘బాడీ ఆర్ట్ పాలిటిక్స్’ (శరీర రాజకీయ కళ) అనే పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు.

అందులో తన నగ్న శరీరం (పై భాగం) మీద తన కొడుకు, కూతురు పెయింటింగ్ వేస్తున్న దృశ్యాన్ని చూపించారు. దీనిని అశ్లీలమైన చర్యగా పరిగణించి ఆమెపై పోలీసులు లైంగిక నేరాల నుంచి పిల్లలను కాపాడడానికి ఉద్దేశించిన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిర్బంధంలోకి తీసుకొన్నారు. తానేమీ తప్పు చేయలేదని తనను విడుదల చేయాలని కోరుతూ ఆమె చేసుకొన్న విజ్ఞప్తిని కింది కోర్టు తిరస్కరించగా ఆమె హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకొన్నారు. మహిళ శరీరాన్ని లైంగిక దృష్టి నుంచి విముక్తం చేయడమే ఆ వీడియో విడుదలలో తన ఉద్దేశమని ఆమె చెప్పుకొన్నారు. మగవారి అర్ధనగ్నత్వాన్ని మామూలు విషయంగా పరిగణించి అనుమతిస్తున్నప్పుడు మహిళ అర్ధనగ్నత్వాన్ని అదే రీతిలో ఎందుకు పరిగణించరు అని ఆమె ప్రశ్నించారు. తన తల్లి నగ్న శరీరాన్ని చూడడానికి అలవాటు పడిన బాలుడు స్త్రీ శరీరం కోరికలు తీర్చుకోడానికి ఉద్దేశించింది కాదని భావిస్తాడు అని కూడా ఫాతిమా అన్నారు. ఆ వీడియో నైతికత విషయంలో సమాజం దృష్టి కోణానికి వ్యతిరేకంగా వుందని, దానిని చూసే వారిని అది అశ్లీల దృష్టి వైపు మరల్చుతుందని ప్రాసిక్యూషన్ వాదించింది. హైకోర్టు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తిరస్కరించింది.

స్త్రీ శరీరాన్ని మితిమించి లైంగిక దృష్టితో చూస్తున్నారని పురుషుడికి తన శరీరం మీద వున్న సంపూర్ణ అధికారం ఆమెకు లేకుండా చేశారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. శరీర నగ్నత్వం అశ్లీలం కానక్కర లేదని, కొంత మంది దృష్టిలో అనైతికం అయినది చట్ట విరుద్ధం కావలసిన పని లేదని, అందుకు శిక్ష విధించవలసిన అవసరం బొత్తిగా లేదని స్పష్టం చేస్తూ మన సంప్రదాయ దృష్టిని న్యాయమూర్తి పూర్తిగా తిరస్కరించారు. ఆమె తన శరీరాన్ని తన పిల్లలు పెయింటింగ్‌కు కాన్వాస్‌గా ఉపయోగించుకోడానికి మాత్రమే అనుమతించిందని అందులో తన పిల్లలను లైంగికంగా వాడుకోడమనే దానికి ఎంత మాత్రం అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. సమానత్వానికి , గోప్యతకు గల ప్రాథమిక హక్కు పరిధిలోకి ఆమె చర్య వస్తుందని, రాజ్యాంగం 21వ అధికరణ హామీ ఇస్తున్న వ్యక్తి స్వేచ్ఛ కూడా ఇక్కడ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ తీర్పు మొత్తం భారతీయ సమాజాన్నే మార్చి వేస్తుందని అనుకోలేము. అయితే ఈ తీర్పులోని రాజ్యాంగ దృష్టికి, మన సమాజ నైతిక దృష్టికి గల వైరుధ్యాన్ని గమనించి తీరాలి.

ఈ వైరుధ్యం పూర్తిగా తొలగిపోయి కేరళ హైకోర్టు చెప్పిన శరీరంపై సంపూర్ణ అధికారం విషయంలో పురుషుడితో సమానమైన హక్కు స్త్రీకి లభించనంత వరకు మనది ప్రజాస్వామ్య సమాజం అనిపించుకోదు. మహారాష్ట్రలోని శనిసింగాపూర్ ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదన్న నిషేధంపై తృప్తి దేశాయ్ చేసిన పోరాటం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఫాతిమా రెహనా కూడా 2018లో కేరళ శబరిమల ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కారు. మహిళలపై అత్యాచారాలు పెరగడానికి వారు దుస్తులు ధరిస్తున్న తీరే కారణమని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిజిపి ఒకరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాగే భారతీయ సమాజంలో మహిళ ఇంటికే పరిమితమై వుండాలని పురుషులు బయటికి వెళ్ళి సంపాదించుకొని రావాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒకప్పుడు ఉద్బోధించారు. ఇటువంటి సంప్రదాయ దృష్టి మహిళకు భారత రాజ్యాంగం ప్రసాదిస్తున్న సమానత్వ హక్కును పూర్తిగా హరిస్తున్నది. రెహనా ఫాతిమా వంటి సాహస ప్రగతిశీల ఉద్యమకారిణుల నిరంతర పోరాటం వల్లనే భారతీయ మహిళ హక్కులు పూర్తిగా ఆమె అనుభవంలోకి వస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News