తిరువనంతపురం: కేరళ హైకోర్టు, 28 మంది న్యాయవాదులకు విచిత్రమైన శిక్ష విధించింది. ఆ న్యాయవాదులంతా కొట్టాయం బార్ అసోసియేషన్ కు చెందినవారు. గతేడాది వారు కొట్టాయంలో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కు వ్యతిరేకంగా అసభ్య దూషణలు చేశారు. వారు కోర్టు ఆవరణలోనే అభ్యంతరకర నినాదాలు చేయడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కరణగా భావిస్తూ సదరు న్యాయవాదులపై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఆ 28 మంది న్యాయవాదులు క్షమాపణ చెప్పేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కానీ హైకోర్టు ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. పైగా క్షమాపణ చెప్పి తప్పించుకుందామనుకుంటే కుదరదని, క్షమాపణలు చెప్పి వెళ్లిపోవడం అనేది చాలా సులభమైన మార్గమని, ఇప్పటి నుంచి మీరంతా ఆరు నెలల పాటు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని, ఎవరి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా ఆ 28 మంది న్యాయవాదులు కూడా కోర్టు ఆదేశాలకు సమ్మతి తెలిపారు. కోర్టు చెప్పినట్టు తప్పకుండా చేస్తామని, న్యాయవాద వృత్తిని కొనసాగించడానికి ఇదేమీ అడ్డంకి కాబోదన్నారు.