తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి లిఫ్ట్‌లో 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజుల పాటు చిక్కుకుపోయినట్లు, మూడవ రోజు సోమవారం ఉదయం మామూలు పనిపై వచ్చిన ఒక ఆపరేటర్ అతనిని రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్ష నిమిత్తం వచ్చిన రోగి ఉల్లూర్‌వాసి రవీంద్రన్ నాయర్ ఇబ్బందులు శనివారం లిఫ్ట్‌లోకి ప్రవేశించినప్పుడు మొదలయ్యాయి. అతను లోనికి వెళ్లిన తరువాత లిఫ్ట్ చెడిపోవడంతో అతను లోపల చిక్కుకుపోయాడు. అతనిని ఆతరువాత ఆరోగ్య సంబంధిత సమస్యలపై ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన పర్యవసానంగా ఈ లోపానికి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఆదివారం రాత్రి అతని కుటుంబం వైద్య కళాశాల పోలీసుల వద్ద ‘వ్యక్తి అదృశ్యం’ కేసు దాఖలు చేసింది.
పోలీసుల కథనం ప్రకారం, నాయర్ ఆసుపత్రి మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. కాని అది చెడిపోయింది. దాని తలుపులు తెరిచేందుకు అతని ప్రయత్నం విఫలమైంది. దీనితో అతను చిక్కుకుపోయి బయటకు రాలేకపోయాడు. సాయం కోసం అతను కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదని, అతని ఫోన్ బ్యాటరీ అయిపోయిందని, సాయం కోసం ఎవరినీ అడగలేకపోయాడని పోలీసులు వివరించారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించి, నివేదిక సమర్పించాలని కోరారు. ఆరోగ్య శాఖ ముగ్గురు సిబ్బంది& ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లను, ఒక డ్యూటీ సార్జెంట్‌ను సస్పెండ్ చేసింది. అయితే, లిఫ్ట్ మామూలుగా ఉపయోగించేది కాదని వైద్య కళాశాల అధికారులు చెప్పారు. కాగా, వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి రెండు రోజుల పాటు లిఫ్ట్‌లో చిక్కుకుపోయాడన్న వార్త దిగ్భ్రాంతికరమని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన కోరారు.