Wednesday, January 22, 2025

కేరళ మంత్రి సాజీ చెరియన్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Kerala Minister Saji Cherian resigns

రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యల పట్ల విచారం
తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ వివరణ
ప్రతిపక్షాల నిరసనలతో దద్దరిల్లిన అసెంబ్లీ

తిరువనంతపురం: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ సాంస్కృతిక వవహారాలు, మత్స శాఖ మంత్రి సాజీ చెరియన్ బుధవారం తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. తన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరించాయని ఆరోపించిన ఆయన ఏదేమైనా జరిగిన దానికి తాను విచారిస్తున్నానని తెలిపారు. సోమవారం పథనంతిట్టలో జరిగిన సిపిఎం సభలో చెరియన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. చెరియన్ వ్యాఖ్యలను కాంగ్రెస్, బిజెపి ఖండించాయి. రాజ్యాంగం ద్వారా మంత్రి పదవిని చేపట్టిన చెరియన్ అదే రాజ్యాంగాన్ని అవమానించారంటూ బిజెపి డుయ్యబట్టింది. పథనంతిట్ట సభలో మాట్లాడుతూ చెరియన్ రాజ్యాంగంపై దోపిడీదారులకు సాధనంగా మారిపోయిందంటూ ఆరోపించారు. బ్రిటిష్ విధానాన్ని కాపీ కొట్టి మనం రాజ్యాంగాన్ని రాసుకున్నామంటూ చెరియన్ వ్యాఖ్యానించడం పెను వివాదానికి దారితీసింది. కాగా..అంతకుముందు బుధవారం ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యలపై పెనుదుమారం చెలరేగింది.

రాజ్యాంగంపై చెరియన్ చేసిన వ్యాఖ్యలపై వాయిదా తీర్మానం కోసం ప్రతిపక్ష యుడిఎఫ్ పట్టుపట్టగా సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్‌డిఎఫ్ వివిధ స్థాయిలలో ఈ అంశంపై సంప్రదింపులు చేపట్టింది. రాజ్యాంగాన్ని, దాని నిర్మాతలను అవమానించిన చెరియన్‌పై చర్యల కోసం కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్ సభ్యులు సభలో నినాదాలు చేశారు. దీనిపై వాయిదా తీర్మానానికి అనుమతించాలని డిమాండు చేస్తూ సభా కార్యకలాపాలను వారు స్తంభింపచేయడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఎంబి రాజేష్ హఠాత్తుగా ప్రకటించారు. దీంతో స్పీకర్ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్ష యుడిఎఫ్ సభ్యులు ఆయనను స్పీకర్ చాంబర్‌లో కలుసుకుని తమ అసంతృప్తిని తెలియచేశారు. తమ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వారు స్పీకర్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా&కేరళ మంత్రి చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలో మీడియా వద్ద స్పందించారు. ఈ అంశాన్ని రాష్ట్ర నాయకత్వం చర్చిస్తోందని, తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News