Friday, December 20, 2024

101ఏళ్ల కేరళ వృద్ధ విద్యార్థిని కార్తాయని అమ్మ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కేరళలో అత్యంత వృద్ధ విద్యార్థినిగా గుర్తింపు పొందిన కార్తాయని అమ్మ ఈనెల 10న కన్నుమూశారు. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక వయోజన అక్షరాస్యత కార్యక్రమంలో ఆమె తన 96 ఏళ్ల వయసులో ప్రథమ ర్యాంకు పొందారు. అయితే ఏడాదిగా ఆమె పక్షవాతంతో మంచాన పడ్డారు. చనిపోయే నాటికి ఆమె వయసు 101 ఏళ్లు. ఆమె నాలుగో తరగతి తత్సమాన పరీక్ష అయిన అక్షర లక్షం పరీక్షలో అత్యధిక మార్కులు సాధించారు. ఈ పరీక్ష రాసిన 43,330 మందిలో ఆమె అత్యంత వృద్దురాలు.

దీంతో ఆమెకు నారీశక్తి అవార్డు కూడా వరించింది. ఈ అవార్డును కార్తాయని అమ్మ ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 2019లో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఆమె మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర సంతాపం తెలియజేశారు. రాష్ట్ర అక్షరాస్యతా మిషన్ కింద అత్యంత వృద్ధురాలిగా చరిత్ర సృష్టించిన కార్తాయని అమ్మ మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సవాళ్లు ఎదురైనా విద్యను అభ్యసించాలనే ఆమె అచంచల సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. కేరళ లోని హరిపాడ్ మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు పిల్లల సంతానవంతురాలైన ఆమె తన గ్రామం లోని దేవాలయాల సమీపంలో వీధులు ఊడ్చి కుటుంబాన్ని పోషించేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News