మైగ్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ (తిరువనంతపురం) సర్వే ప్రకారం 2023లో కేరళ నుంచి విదేశాలకు ఉన్నత చదువులకోసం 2.5 లక్షల మంది విద్యార్థులు వలస వెళ్లారు. దేశం మొత్తం మీద విదేశాలకు వెళ్లిన మొత్తం విద్యార్థుల సంఖ్యలో కేరళ విద్యార్థుల సంఖ్యే 20% వరకు ఉంటోందని తేలింది. కేరళ నుంచి ఇంత భారీ ఎత్తున విద్యార్థులు వలస వెళ్లడానికి దారి తీసే పరిస్థితులు ఏమిటి? ఈ విధమైన పరిస్థితి కేరళ రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక అంశాలపై విపరీత ప్రభావం చూపిస్తుంది. ఏ దేశంలో ఉపాధికి, ఉద్యోగాలకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయో, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎక్కడ ప్రోత్సాహకర వాతావరణం ఉంటుందో అక్కడకు ప్రజలు వలస వెళ్లడం సహజం. అలాగే విద్యార్థుల ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు భారీ ఎత్తున అవకాశాలు ఉంటున్నందున విద్యార్థుల వలస విశేష సంఖ్యలో కొనసాగుతోంది.
కేరళలో విద్యావంతులు ఎక్కువే. నిరుద్యోగమూ ఎక్కువే. ఉద్యోగాలను ఆశిస్తూ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజిల్లో 2023లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి సంఖ్య 29 లక్షలు దాటింది. వీరిలో ఎస్‌ఎస్‌ఎల్‌సి లేదా అంతకన్నా ఎక్కువ చదువుకున్న వారి సంఖ్య 23 లక్షల వరకు ఉంది. సాంకేతికంగా అర్హత కలిగిన వారు 3.5 లక్షలకు పైబడి ఉన్నారు. దీనికి తోడు యూనివర్శిటీల చదువులు పూర్తి చేసుకుని ఏటా లేబర్ మార్క్‌ట్‌లోకి చేరుతున్న వారి సంఖ్య మరో లక్ష వరకు ఉంటోంది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారి సంఖ్య 20 లక్షలు దాటింది. అలాంటి గెస్ట్ వర్కర్లు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ నిరుద్యోగులైన విద్యావంతులు మాత్రం ఏపని అయినా చేయడానికి సిద్ధంగా ఉండరు. వీరు తమ సామాజిక హోదాకు తగ్గట్టు ఎక్కువ వేతనం అందించే సుస్థిరమైన ఉద్యోగాలను ఆకాంక్షిస్తుంటారు. అయితే అలాంటి ఉద్యోగాలు చాలా తక్కువగా ఉండటంతో నిరుద్యోగులు అలాగే ఉండిపోతున్నారు. మొత్తం మీద వలస విద్యార్థులు ముఖ్యంగా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లడానికి ముందు వరుసలో ఉండడం పరిపాటి. ఈ దేశాల్లో ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీగా లభించే అవకాశాలు పుష్కలంగా ఉండడమే ఈ ఆకర్షణకు కారణం.
కేరళలో ఇచ్చే వేతనం కన్నా అనేక రెట్లు వేతనం విదేశాల్లో ఇస్తున్నారు. ఉదాహరణకు అమెరికాలో పనిచేసే ఒక నర్సు నెలకు రూ. 4,00,000 వరకు సంపాదిస్తోంది. దీనికి తోడు విలాసవంతమైన నివాసం, కార్లు, అత్యంత ఆధునికమైన పరికరాల వినియోగం కేరళలో ఉండే తమ తల్లిదండ్రులకు అందేలా చేస్తోంది. విదేశాల్లో ఈ విధంగా సంపాదించే వేతనాల్లో కనీసం పదోవంతైనా కేరళలోని నర్సుకు దక్కడం లేదు. కలలోనైనా అలాంటి విలాస జీవనం ఊహించే అవకాశం కలగదు. నర్సులే కాదు, దాదాపు అన్ని కేటగిరీలకు చెందిన వర్కర్లు కేరళలో తమ వేతనాలతో అలాంటి విలాసవంత జీవితాన్ని కలగనడానికైనా అవకాశమే ఉండదు. వలస వెళ్లిన వారి కుటుంబాలు కేరళలో అత్యంత విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఈ కుటుంబాల యువకులు, కుర్రాళ్లు సాధారణంగా తమకు తాము విలాసవంతమైన జీవితాన్నే కోరుకుంటారు. అలాంటి బంగారు స్వప్నాలు వారిని విదేశాలకు వెళ్లి చదువుకోడానికి, అక్కడే ఉద్యోగాలు చేయడానికి దోహదం చేస్తున్నాయి. అయితే చాలా మందికి విదేశాలకు వలస వెళ్లడం పూలబాట కాకపోవచ్చు. అమెరికా ఇటీవల తీసుకున్న నిర్ణయం భారతీయ కుటుంబాలకు చెందిన వేలాదిమంది పిల్లల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంగా ఉంటోంది.
చిన్నవయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చినవారు అక్కడే పెరిగి, చదువులు పూర్తి చేసుకుని తమకు 21 ఏళ్లు రాగానే అమెరికా ప్రభుత్వం వారిని స్వదేశానికి దయచేయండి అని చెప్పడం వివాదాస్పదంగా తయారైంది. ఇక తెలుగు రాష్ట్రాల విద్యార్థుల పరిస్థితిని పరిశీలిస్తే అమెరికాలో భారతీయ విద్యార్థుల్లో 12.5 శాతం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగువారే ఉన్నారు. అందువల్ల ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా అమెరికాకు వస్తే తమ చుట్టూ తెలుగువారే ఎక్కువగా కనిపిస్తుండటంతో వారు విదేశాల్లో ఉన్నామన్న భావన కన్నా స్వంత రాష్ట్రాల్లోనే ఉన్నామన్న అనుభూతి కలుగుతోంది. అమెరికాలో తెలుగు మాట్లాడే జనాభా 2016లో 3,20,000 నుండి 2024 నాటికి 1.23 మిలియన్‌కు పెరిగింది. అమెరికా సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా కాలిఫోర్నియాలో అత్యధికంగా తెలుగు మాట్లాడే జనాభా దాదాపు 2,00,000 వరకు ఉంది. ఇప్పుడు అమెరికాలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో 11 వ స్థానంలో తెలుగు ఉంది.