తిరువనంతపురం: గత కొన్ని రోజులుగా కొవిడ్19 కేసులు తగ్గు ముఖం పట్టడంతో కేరళ ప్రభుత్వం ఫిబ్రవరి 7 నుంచి విద్యార్థులకు ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించాలని కేరళ శుక్రవారం నిర్ణయించింది. “ 10,11,12 తరగతి విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు ఫిబ్రవరి 7 నుంచి క్లాసులు మొదలు కానున్నాయి. కాగా 1 నుంచి 9వ తరగతి వరకు, క్రెష్, కిండర్‌గార్టెన్ విద్యార్థులకు ఫిబ్రవరి 14 నుంచి క్లాసులు మొదలు అవుతాయి” అని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో కొవిడ్19పై విశ్లేషణ జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళలో కొవిడ్19 యాక్టివ్ కేసులు ఫిబ్రవరి 3 నాటికి 3,77,823 నుంచి 3,69,073కు తగ్గాయి. కేరళను సందర్శించే ఇతర రాష్ట్రాల వారిని, విదేశీ యాత్రికులను పరీక్షించాలని కూడా కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాగా కేరళలోని అన్ని మందిరాలకు భక్తుల సంఖ్యను 20కి పరిమితం చేశారు. అత్తుకల్ మందిరంలో పొంగలకు మొత్తం 200 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేరళలో కొల్లం జిల్లా ఒక్కటే ‘సి’ కేటగరిలో ఉంది. అక్కడ అత్యధిక ఆంక్షలు విధించారు. కాగా తిరువనంతపురం, పతనంతిట్ట, అళపుర, కొట్టాయం, ఇడుక్కీ, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, వాయ్‌నాడ్, కన్నూర్ జిల్లాలు ‘బి’ కేటగిరిలో, మళప్పురం, కొజికోడ్ జిల్లాలు ‘ఎ’ కేటగిరిలోనూ ఉన్నాయి. ‘ఎ’ కేటగిరిలోని జిల్లాల్లో సామాజిక, సాంస్క ృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ, బహిరంగ వేడుకలకు, వివాహాలు, అంత్యక్రియలకు 50 మంది వరకు హాజరు కానిస్తారు. కాగా ‘బి’, అలాగే ‘సి’ కేటగిరి జిల్లాల్లో ఇలాంటి సమూహిక కార్యక్రమాలకు ప్రజలను అనుమతించరు. కాకపోతే వివాహాలు, అంత్యక్రియలకు ఈ కేటగిరి జిల్లాల్లో గరిష్ఠంగా 20 మంది వరకు అనుమతిస్తారు. ఇక ‘సి’ కేటగిరి జిల్లాల్లో సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌పూల్స్, జిమ్స్ వంటివి పనిచేయడానికి అనుమతిని ఇవ్వరు.