Tuesday, November 5, 2024

4.30 గంటలు డోర్ పట్టుకునే ఉన్నాం..

- Advertisement -
- Advertisement -

హమాస్ దాడిని ప్రత్యక్షంగా చూసిన కేరళ మహిళ

న్యూఢిల్లీ : కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ ఇజ్రాయెల్‌లో కేర్‌గివర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల గాజా సరిహద్దుల్లోని నీర్ ఓజ్ అనే కిబుట్జ్ లోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి నరమేథానికి పాల్పడిన సమయంలో వారు అక్కడే విధి నిర్వహణలో ఉన్నారు. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి వారు ఓ వృద్ధురాలిని హమాస్ దాడి నుంచి కాపాడగలిగారు. వారి ధైర్యాన్ని అభినందిస్తూ భారత్ లోని ఇజ్రాయెల్ ఎంబసీ తాజాగా తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆనాడు వారు ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని సబిత ఆ వీడియోలో ఈ విధంగా గుర్తు చేసుకున్నారు.

“ ఈ సరిహద్దు ప్రాంతంలో నేను మూడేళ్లుగా పనిచేస్తున్నా. ఎఎల్‌ఎస్ వ్యాధితో బాధపడుతున్న రహేల్‌కు నేను, మీరా మోహన్ కేర్‌గివర్లుగా ఉన్నాం. ఆ రోజు ( అక్టోబర్ 7) నేను నైట్ డ్యూటీలో ఉన్నా. ఉదయం 6.30 గంటలకు వెళ్లి పోవాల్సింది. సరిగ్గా అదే సమయంలో మాకు సైరన్లు వినిపించాయి. వెంటనే రహేల్‌ను తీసుకుని మేం సేఫ్టీ గదుల్లోకి పరిగెత్తాం. సైరన్ల మోత ఆగట్లేదు.

బయట ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు రహేల్ కుమార్తె మాకు ఫోన్ చేసి… ‘ పరిస్థితి చేయిదాటి పోయింది. ముందు, వెనుక డోర్లు లాక్ చేసుకోండి ’ అని చెప్పారు. ” వెంటనే మేం తలుపులు లాక్ చేసుకున్నాం. ఉదయం 7.30 గంటల సమయంలో ఉగ్రవాదులు మా ఇంట్లోకి చొరబడ్డారు. మేం ఉన్న గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. మాకేం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ రహేల్ కుమార్తెకు ఫోన్ చేశాం. డోర్‌ను గట్టిగా పట్టుకోండి. వదిలి పెట్టొద్దు అని ఆమె చెప్పారు. మేం అలాగే చేశాం.

గ్రిప్ పోకుండా ఉండేందుకు చెప్పులను కూడా తీసేశాం.బయటి నుంచి ఉగ్రవాదులు మాగది తలుపు బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు మేం ఆ డోర్‌ను గట్టిగా పట్టుకునే ఉన్నాం. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మళ్లీ కాల్పుల చప్పుడు వినిపించింది అప్పుడు షెములిక్ (ఆ ఇంటి యజమాని) వచ్చి ఇజ్రాయెల్ సైన్యం వచ్చిందని చెప్పారు. ఆయన బయటికెళ్లి చూసే సరికి అంతా ధ్వంసమై కనిపించింది. మా ఇంట్లో ఉగ్రవాదులు అన్నీ దోచుకెళ్లారు మీరా పాస్‌పోర్ట్, నా ఎమర్జెన్సీ బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లారు. ” సాధారణంగా సరిహద్దుల్లో ఉండే మాకు క్షిపణులు పడినప్పుడు సేఫ్టీ గదుల్లోకి వెళ్లి .. పరిస్థితులు సద్దు మణిగాక బయటకు రావడం అలవాటే. అప్పుడు మా ఎమర్జెన్సీ బ్యాగులు తీసుకుని వెళ్తాం.

అందులో మా డాక్యుమెంట్లన్నీ ఉంటాయి. కానీ ఇలాంటి ఉగ్రదాడిని మేం ఊహించలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ” అని సబిత వీడియోలో నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ వీడియోతోపాటు హమాస్ తూటాలు దిగిన గది తలుపు ఫోటోను కూడా భారత్ లోని ఇజ్రాయెల్ ఎంబసీ పోస్ట్ చేసింది. “ భారత వీర వనితలు వీరు. హమాస్ దాడి నుంచి ఇజ్రాయెల్ పౌరులను కాపాడారు ” అని కొనియాడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News