Friday, November 8, 2024

నేటి నుంచి రైళ్ల రాకపోకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య ధ్వంసమైన రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశారు. వరద ధాటికి రెండు రోజుల క్రితం ధ్వంసమైన రైల్వే ట్రాక్‌ను 36 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైల్వే శాఖ రికార్డు సృష్టించింది. రైల్వే శాఖ సిబ్బంది శ్రమించి రెండు రోజుల్లోనే మరమత్తు పనులు పూర్తి చేశారు. పనులు పూర్తైన తర్వాత ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద రైలు పట్టాలపై ట్రయిల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. బుధవారం నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే, కొత్తగా ట్రాక్ నిర్మించడంతో ఆ ప్రాంతంలో రైళ్లు నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె- కేశముద్రం మధ్య రైల్వే ట్రాక్ వరదలకు పూర్తిగా ధ్వంసమైన విసయం తెలిసిందే. దీంతో ఈ రూట్లో వెళ్ళే అన్ని రైళ్లను నిలుపుదల చేశారు. ఈ మార్గంలో ఐదు చోట్ల ట్రాక్ తీవ్రంగా పాడవగా వాటి మరమ్మత్తు పనులు యుద్దప్రాతిపదికన చేపట్టినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రెండు చోట్ల రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మరో రెండు మూడు రోజుల్లో ట్రాక్ ను అందుబాటులోకి తీసుకు వస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కాగా ఈ రూట్లో వెళ్ళే 108 రైళ్లను మంగళవారం 88 రైళ్లను బుధవారం పూర్తిగా రద్దు చేశారు.

మరికొన్నిటిని దారి మళ్లించారు. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే 560 రైళ్లను రద్దు చేయగా, మరో 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 185 రైళ్లను రూటు మార్చి నడుపుతోంది. కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లను తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా ఎక్స్ ప్రెస్, శబరి, విశాఖ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే పద్మావతి ఎక్స్ ప్రెస్ ఐదున్నర గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విశాఖపట్నం-నాందేడ్, నాందేడ్-విశాఖపట్నం రైళ్లను కూడా రద్దు చేశారు. చెన్నై సెంట్రల్-శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా ఎక్స్ ప్రెస్ ను విజయవాడ, విశాఖ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News