బిబిసి రిపోర్టర్ మాస్క్‌ను లాక్కుని ఇంటర్వూను ఆపేసిన వైనం
న్యూఢిల్లీ : హరిద్వార్ ధర్మసంసద్‌లో ద్వేషపూరిత ప్రసంగాలపై ప్రశ్నించినందుకు ఉత్తరప్రదేశ్ బిజెపి నేత కేశవ్ ప్రసాద్ మౌర్య ఆగ్రహం వెలిబుచ్చారు. ఇంటర్వ్యూను మధ్యలో ఆపేసి విలేఖరి మాస్క్‌ను లాక్కున్నారు. ఇంటర్వ్యూ ఫుటేజిని తొలగించాలని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయిన మౌర్య తరువాత ఈ సంఘటనను దురదృష్టకరమైనదిగా పేర్కొన్నారు. బిబిసి ఇంటర్వ్యూ సందర్భంగా ఇది జరిగింది. ఇంటర్వ్యూ చేసే విలేఖరి హరిద్వార్ మతసమావేశంలో ద్వేష ప్రపంగాల గురించి, బిజెపి అగ్రనేతలు మౌనంగా ఉండడంపై మౌర్యను ప్రశ్నించారు. అలాంటి ప్రసంగాలకు తాము వ్యతిరేకమని బిజెపి నేతలు ప్రజలకు భరోసా ఇస్తారా అని అడిగారు.
దీనికి సమాధానంగా మౌర్య తమకు తాము నిరూపించుకోవలసిన అవసరం లేదన్నారు. సబ్‌కాసాత్, సబ్‌కా వికాస్ (అభివృద్ధి, మరియు అందరికీ అండదండలు) అన్నదాన్నే తాము నమ్ముతామని చెప్పారు. మతపరమైన నాయకులకు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు ఉందని వత్తాసు పలికారు. కేవలం హిందూమత నేతలనే ఎందుకు ప్రశ్నిస్తున్నారు ? ఇతర మతాల నాయకుల వ్యాఖ్యల సంగతేమిటి ? ఆర్టికల్ 370 రద్దు కాకముందు ఎంతమంది జమ్ముకశ్మీర్ విడిచిపెట్టి వెళ్లిపోవలసి వచ్చింది? మీరు ప్రశ్నించేటప్పుడు వారు ఒకే గ్రూపు వారు కాకూడదు. ధర్మసంసద్ బిజెపి కార్యక్రమం కాదు. అది మతపరమైన నాయకులది అని ఉపముఖ్యమంత్రి మౌర్య ఆ విలేఖరిపై ప్రశ్నలు సంధించారు.