న్యూస్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విజయవాడ టిడిపి ఎంపి కేశిని నాని మళ్లీ వార్తల్లో ఎక్కారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి టిడిపి తరఫున పోటీ చేసి గెలిచిన నాని 2024 ఎన్నికల్లో పార్టీ తనకు విజయవాడ టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానంటూ ప్రకటించారు.
గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానంపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం తనకు ఆహ్వానం పంపక పోవడం వల్లే తాను ఇటీవల రాజమండ్రిలో జరిగిన మహానాడులో పాల్గొనలేదని నాని వెల్లడించారు. పార్టీకి ఇవ్వడానికి తన వద్ద ఏమీలేకపోవడం వల్లే తాను మహానాడుకు హాజరుకాలేదని, తన నియోజకవర్గానికి ఇప్పుడు మరో ఎంపి ఇన్‌చార్జా వ్యవహరిస్తున్నారని ఆయన తన అసంతృప్తిని బయటపెట్టారు.
పార్టీ నాయకత్వం మీపై వేటువేయలేదు, పార్టీ నుంచి బహిష్కరించలేదు, పార్టీ నుంచి వెళ్లిపొమ్మని కోరలేదు కదా అన్న విలేకరుల ప్రశ్నకు దీనికి ఎవరి భాష్యం వారు చెప్పుకోవచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రజలు తన పట్ల సంతృప్తిగా ఉన్నారని, ఇక్కడి ప్రజల బాగోగులే తనకు ముఖ్యం కాబట్టి తాను స్వతంత్ర అభ్యర్థిగానైనా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని నాని స్పష్టం చేశారు.
రెండవసారి ఎంపిగా గెలిచిన కేశినేని నాని టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవిని ఆశించినప్టపికీ ఆ పదవి గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌కు దక్కింది. దీంతో నాని తీవ్ర మనస్థాపం చెందారు. అంతేగాక, తన సోదరుడు కేశినేని శివనాథ్ టిడిపిలో చేరడం కూడా ఆయనకు మింగుడు పడలేదు. శివనాథ్ కూడా విజయవాడ లోక్‌సభ స్థానం లేదా అసెంబ్లీ స్థానం టిక్కెట్‌ను ఆశిస్తున్నారు.
======