Monday, December 23, 2024

తెలంగాణ పేరు ప్రతిష్టలను ఢిల్లీలో చాటిచెప్పిన మౌనిక : స్పీకర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన అమ్మాయి కేతావత్ మౌనిక ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్టలను చాటిచెప్పిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గుడ్ గవర్నెన్స్‌డే సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన యూత్ పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మౌనిక ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆమె మంగళవారం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. మౌనిక స్వగ్రామం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ గ్రామీణ మండలంలోని పోచారం. కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె స్పీకర్‌ను కలిసింది. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మౌనికను అభినందించారు. తెలంగాణ పేరు ప్రతిష్టలను ఢిల్లీలో చాటి చెప్పిందని కొనియాడారు.

ఒక గిరిజన అమ్మాయి చిన్న గ్రామం నుండి పార్లమెంటు సెంట్రల్ హాలో ప్రసంగించే స్థాయికి ఎదగడం గొప్ప విషయమని అన్నారు. యూత్ పార్లమెంట్ ప్రసంగించడానికి దేశవ్యాప్తంగా ఏడుగురు వ్యక్తులు ఎంపికైతే అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మౌనిక ఒక్కరే ఎంపికయ్యిందని తెలిపారు. వివాద రహితుడు, నిస్వార్థుడైన ఆదర్శరాజకీయ నాయకుడు వాజ్‌పేయి గురించి మౌనిక మాట్లాడిందన్నారు. మంచి భాషా పరిజ్ఞానంతో మాట్లాడి అందరినీ ఆకట్టుకుందన్నారు. మౌనిక భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాక్షించారు. మౌనిక విద్యభ్యాసం ఖర్చుతో పాటు తన సివిల్స్ శిక్షణకు అయ్యే ఖర్చును భరిస్తానని పోచారం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సందర్శనకు వచ్చేసిన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్,తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మౌనికను పరిచయం చేశారు. ఈ సందర్భంగా మౌనికను సత్కరించి మెమొంటోను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News