పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన కథానాయిక కేతిక శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
మాతృకతో పోలిస్తే బ్రో సినిమాలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. వినోదంతో పాటు వివిధ హంగులు జోడించి, మాతృక కంటే మరింత అందంగా మలిచారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో నాకు సన్నివేశాలు లేవు. కానీ ఆయనతో కలిసి సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్న మార్క్‌కి ప్రేయసిగా కనిపిస్తాను. ఇది సినిమాకి ముఖ్యమైన, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. సినిమాలోని ప్రతి పాత్ర కథని ముందుకు నడిపించేలా ఉంటుంది”అని అన్నారు.