సత్యవర్ధన్ అనే దళిత వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ వైసిపి నేత వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని జైల్లో తనకు బెడ్ ఇప్పించాలని, ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని, ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని పిటిషన్‌లో కోరారు. తనపై కుట్రపూరితంగా, కక్షపూరితంగా కేసు పెట్టారని పేర్కొన్నారు.
సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశాననేది తనపై అక్రమంగా పెట్టిన కేసు అని చెప్పారు. ఇద్దరి పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జైల్లో వల్లభనేని వంశీ నేలపైనే పడుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఉంటున్న సెల్ వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు. వంశీ బయటకు కనపడకుండా సెల్‌కు అడ్డంగా పరదా కట్టారు. జైల్లో బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వారు ఉండటంతో వారి నుంచి వంశీకి అపాయం కలగకుండా జైలు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.