పబ్బుల ముందు తప్పనిసరిగా బోర్డులు పెట్టాలి
జనవరి 4 వరకు న్యూ ఇయర్ ఆంక్షలు అమలు
హైదరాబాద్: నగరంలోని పబ్బులు వ్యవహారంపై పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ఇళ్ళ మధ్య పబ్‌ల ఏర్పాటుపై జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం నాడు హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పబ్బుల ముందు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను హైకోర్టు ఆదేశించింది. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యతని, పోలీసులు ఆంక్షలను 4వ తేదీ ఉదయం వరకు అమలు పరచాలని ఆదేశించింది. అదేవిధంగా శబ్ద కాలుష్యం 45 డేసిబుల్స్‌కి మించరాదని, పబ్బులకు వెళ్లే జంటలతో పాటు వచ్చే మైనర్లను అనుమతించొద్దని చెప్పింది. వేడుకలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలు అమలు పరచాలని స్పష్టంచేసింది.
వేడుకలు ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు, పోలీసు నివేదికల ఆధారంగా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది. తాగి వాహనాలను నడపవద్దంటూ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు తాగిన వారికి డైవర్లను అందుబాటులో ఉంచాలని, ఈ నిబంధనలు జనవరి 3వ తేదీ అర్థరాత్రి వరకు అమలు చేయాలని ఆదేశించింది. ఎక్సైజ్ శాఖను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పోలీస్ శాఖ తరపున న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు ఎక్సైజ్ శాఖను ప్రతివాదులుగా చేర్చాలని తెలిపింది. అలాగే మైనర్లను పబ్ లోపలికి అనుమతించవదని, పేరెంట్స్ తో పాటు వచ్చిన మైనర్‌లను అనుమతించవద్దని సూచించింది. తదుపరి విచారణలో హైకోర్టుకు అందే నివేదికల ఆధారంగా విచారణ చేపడతామని, తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.