Monday, November 25, 2024

ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గ్రేటర్ హైదరాబాద్‌లోని వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పూజ చేసిన తర్వాత భక్తులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది. చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్‌కు భారీగా గణనాథులు తరలివెళ్లాయి. గణేశ్ విగ్రహాలను చూసేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు జనంతో నిండిపోయాయి. బాలాపూర్ నుంచి బయలుదేరిన వినాయకుడి విగ్రహం చార్మినార్ నుంచి హుస్సేన్‌సాగర్‌కు ర్యాలీగా వచ్చి నిమజ్జనం చేశారు. బాలాపూర్ గణేషుడిని అనుసరిస్తూ వందలాది వినాయక విగ్రహాలు నిమజ్జనానికి రావడంతో ఎంజే మార్కెట్ పలు ప్రాంతాల్లో భారీగా వినాయకుడి విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌కు తరలివెళ్లాయి. మరోవైపు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పారా మిలిటరీ బలగాలు ఉన్నాయి.

నగరంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాదిగా గణేశుని విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్నాయి. గణేశ్ నిమజ్జనం సందర్భంగా యువత డ్యాన్సులతో అదరగొట్టారు, అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ దేవదేవుడికి వీడ్కోలు పలికేందుకు ట్యాంక్‌బండ్‌కు భక్తులు తరలివచ్చారు. ఐదు గంటలపాటు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగింది. మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు రూట్ క్లియర్ చేయడంతో క్రేన్ నెంబర్ 4వద్ద మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా అక్కడి నుంచి టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా క్రేన్ నెంబర్ 4కు మహాగణపతి చేరుకున్నాడు.

పటిష్టమైన భద్రత ఏర్పాటు…
వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, జిల్లాల నుంచి పోలీసులను నగరంలో బందోబస్తుకు నియమించారు. ఎక్కడి కక్కడ భారీకేడ్లు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ ఆంక్షలు పటిష్టంగా అమలు చేయడంతో నగరంలో ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడలేదు. కమాండ్ కంట్రోల్‌లో సిసిటివిల ద్వారా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిమజ్జనాన్ని పరిశీలించారు.

పోలీసులు డ్యాన్స్……
వినాయకుడి నిమజ్జనం బందోబస్తుకు వచ్చిన పోలీసులు అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు డ్యాన్స్‌తో భక్తులను హుషారెక్కించారు. పోలీసులకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో మార్మోగాయి. నిమజ్జనం కోసం వచ్చే వారు డిజేలో పాటు పెట్టడంతో దానికి అనుగుణంగా పోలీసులు నృత్యాలు చేశారు. ఓ కానిస్టేబుల్ డివైడర్‌పై నిలబడి డీజే సాంగ్స్‌కు స్టెప్పులు వేశారు. గణేశ్ నిమజ్జనంలో ఓ కానిస్టేబుల్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానిస్టేబుల్ డ్యాన్సుకు అక్కడి జనం ఫిదా అయ్యారు. మరికొందరు పోలీసు అధికారులు కూడా భక్తులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. నిత్యం భద్రతా చర్యలో నిమగ్నమయ్యే పోలీసులు ఇలా స్టెప్పులు వేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

మహిళా సిబ్బంది…
వినాయకుడి నిమజ్జనానికి పోలీసులు ఈసారి మహిళ సిబ్బందిని కూడా నియమించారు. మహిళా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీరిని నియమించారు. ఎవరైనా ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్‌లో పడిపోతే కాపాడేందుకు స్విమ్మర్లను నియమించారు. అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల ఆటకట్టించేందుకు షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో ట్యాంక్ బండ్‌పై తిరిగారు. ప్రతి ఒక్కరిని పరిశీలించారు, పోకిరీలను అదుపులో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

నిర్విఘ్నంగా గణేష్ నిమజ్జనం
– 4500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు
-పిఎస్‌ఐఓసి నుంచి భద్రతను పర్యవేక్షించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని జరిగే గణేష్ నిమజ్జనాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర పరివీలించారు. పిఎస్‌ఐఓఎసి నుంచి సిసి స్క్రీన్‌పై నిమజ్జన సరళిని పర్యవేక్షించారు. ఇప్పటికే పలుమార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆయా జోన్లలో అధికారులతో కలిసి పర్యటించారు. గణేశ్ నిమజ్జనం ముందస్తుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సిపి స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. రాజేంద్రనగర్ జోన్‌లో ఉన్న పత్తికుంట చెరువు, బేబిపాండ్, మాదాపూర్ జోన్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంగారం చెరువును , బాలానగర్ జోన్‌లోని కూకట్ పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఐడిఎల్ చెరువు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న నిమజ్జనాన్ని పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా 4,500 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రత దృష్ట్యా కమిషనరేట్ పరిధిలో డ్రోన్లకు అనుమతి లేదని సిపి స్టిఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. పిఎస్‌ఐఓసి నుంచి సిసిటివిల ద్వారా నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు.

ప్రభుత్వ అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. సైబరాబాద్ పోలీసులు ఇతర డిపార్ట్మెంట్ లతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. సైబరాబాద్‌లో కమీషనరేట్ పరిధిలో ఈ ఏడాది 10,979 పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారన్నారు. మాదాపూర్‌లో జోన్ -1,712, బాలానగర్ జోన్- 3,331, రాజేంద్రనగర్ జోన్- 2,112, మేడ్చల్ జోన్- 1,912, శంషాబాద్ జోన్- 1,912 విగ్రహాలు ప్రతిష్టించారన్నారు. గురువారం 4,474 విగ్రహాలను నిమజ్జనం చేస్తారని మిగతావి శుక్రవారం నిమజ్జనం చేస్తారని తెలిపారు. సైబరాబాద్ కమీషనరేట్ నుంచి హుస్సేన్ సాగకు మొత్తం 32 గణేశ్ విగ్రహా లు నిమజ్జనానికి వెళ్లాయని తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 34 చెరువులు ఉన్నాయని వాటిలో నిమజ్జనం చేస్తున్నారని తెలిపారు. కమీషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం 44 స్టాటిక్ క్రేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, వ్యాప్తి చేయవద్దని కోరారు. -ఏదైనా సాయం కోసం మహిళలు సైబరాబాద్ షీ టీమ్స్ హెల్ప్ లైన్ నంబర్ 9490617444కు కాల్ చేయాలని తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News