సెల్పీల కోసం పోటీపడుతున్న భక్తులు
ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడు ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. కొవిడ్ ప్రభావంతో గతేడాది నిరాడంబరంగా వేడుకలు నిర్వహించిన ఉత్సవ కమిటీ ఈ ఏడాది 40 అడుగుల గణపతి విగ్రహాన్ని తయారుచేయించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహం తయారీ పూర్తికావడంతో చవితికి ముందు నుంచే భక్తులు గణపతి విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏటా ప్రత్యేకమైన అవతారంలో ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తుంటారు. 2019లో శ్రీ ద్వాదశదిత్య మహా గణపతి రూపంలో (61 అడుగులు), పది తలలతో సూర్య భగవానుని రూపుడై భక్తులకు దర్శనమిచ్చాడు. 2020 సంవత్సరంలో ఉత్సవాలపై కొవిడ్ ప్రభావం పడడంతో గతేడాది ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో కేవలం 9 అడుగుల ప్రతిమను ఉత్సవ కమిటీ ప్రతిష్టించింది. దర్శనానికి భక్తులను అనుమతించ లేదు.