Friday, January 17, 2025

నడిగడ్డలో ఖల్ (కల్లు) నాయక్

- Advertisement -
- Advertisement -

నాడు పేదరికం నేడు కింగ్ మేకర్
గద్వాలను శాసిస్తున్న మాఫియా లీడర్
ముంబయ్, రాయచూర్ టు గద్వాల
సిహెచ్, ఆల్పాజోలం రవాణా?
రాజకీయ అండతో కోట్లకు పడగలెత్తిన వైనం
ప్రతి ఊరిలో ఇద్దరు అనుచరులు
కృత్రిమ కల్లుతో పేదల ఆరోగ్యాలు గుళ్ల

మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో ః జోగులాంబ గద్వాల జిల్లాలో కల్లు దందా జోరుగా సాగుతోంది.తాటి, ఈత చెట్లు లేక పోయినా, తాగేందుకు రక్షిత మంచి నీరు లేక పోయినా, పుస్టిగా కల్లు దొరుకుతుంది. అది ఒరిజనల్ కల్లు కాదండోయ్.. అదొక కృత్రిమ కల్లు..ఈ కల్లుతోటే కోట్లకు పడగలెతాడు ఓ ప్రబుద్దుడు. ఒకప్పుడు సామాన్యుడిగా నడిచిన ఆయన ప్రస్తానం నేడు కల్లు కింగ్‌మేకర్‌గా మారాడు. గద్వాలకు డాన్‌గా మారిపోయారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్లు పేద గౌడ సామాజిక వర్గాల ప్రజల సొసైటీల కడుపులు కొట్టి సిండికేట్‌గా మారాడు. వారి పేరు చెప్పి అప్పనంగా బోంచేస్తున్నాడు. కల్లులో ఖల్ నాయక్‌గా ఎదిగారు. కల్లు సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు రాజకీయంలో చేరారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టి తన దోపిడి సామ్రాజాన్యి కాపాడుకుంటున్నాడు.

వడ్డేపల్లి టు గద్వాల

ఈ డాన్ వడ్డేపల్లిలోని ఓ చిన్న గ్రామంలో పుట్టి చిన్న కల్లుదుకాణంను నడిపేవారు. అక్కడి నుంచి మొదలైన ఆయన అక్రమ వ్యాపారం గద్వాల జిల్లా కేంద్రం వరకు సాగింది. కల్లుతో పాటు గతంలో ఇసుక మాఫియాలో అడుగుపెట్టి అక్రమాలపై ఓనమాలు నేర్చుకున్నాడు. అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు కోట్లకు పడగలెత్తారు. అంతేకాదు గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటి అధ్యక్షునిగా గతంలో పని చేసి రాజకీయ రుచి మెరిగిన నేతగా ఎదిగారు. ఇక అప్పటి నుంచి జిల్లాలో ఏ మాఫియా ఉన్నా అందులో ఈయనగారిది పాత్ర ఉండాల్సిందేనని అక్కడి వారు చెబుతున్నారు.

గద్వాలను శాసిస్తున్న మాఫియా లీడర్

కల్లు మాఫియాతో పాటు ఇసుక, బియ్యం మాఫియాలో కూడా బాగస్వామ్యం ఉండడంతో గద్వాలలో ఆయనో మాఫియా లీడర్‌గా మారారు.చీకటి కింగ్‌గా మారారు. రాజకీయ ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో ఈయనగారి చీకటి వ్యాపారాలను అరికట్టే వారే కరువయ్యారు. ఒక వైపు కల్లు సామ్రాజ్యాన్ని అధికారికంగా లైసన్స్ ఉన్న దుకాణాలు కొన్ని అయితే అనేకం లైసన్స్ లేనవి కూడా నడుపుతూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. మల్దకల్, కెటి దొడ్డిలో తన ముఖ్య అనుచరులును ఏర్పాటు చేసుకొని అనుమానాలు రాకుండా కృత్రిమ కల్లును తయారు చేసుకుంటూ పేదలను గుళ్ల చేస్తున్నాడు.

ముంబాయి టు గద్వాల సిఎహెచ్ రవాణా?

ఒరిజనల్ కల్లు లభ్యం కాక పోవడంతో కృత్రిమ కల్లును పెద్ద ఎత్తున తయారు చేస్తున్న ఈ డాన్ అందులో మత్తు ఎక్కడానికి కలిపే ప్రాణాంతకమైన సిహెచ్(క్లోరోహైడ్రేడ్),ఆల్పాజోలం, చాక్రిన్ వంటివి కల్లుపుతున్నట్లు తెలుస్తోంది. వీటిని ఇక్కడి ప్రభుత్వం నిషేదించింది. తెలంగాణలో వాటిని విక్రయించినా, పట్టుబడినా కేసులు నమోదు అవుతాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి వాటిని తరలించుకుంటున్నారు. ఈ మాఫియా లీడర్ తనకు ఉన్న పలుకుబడితో ముంబాయ్ నుంచి రాయిచూర్ మీదుగా తన అనుచరులతో జోగులాంబకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాయచూరు నుంచి కర్నాటక బార్డర్‌లో మల్దకల్, కెటి దొడ్డి మండలాల్లోని శివారు గ్రామాల నుంచి తరలించుకుంటున్నారు. వాటిని ఇక్కడి కల్లులో కలిపి పేదలకు తాగిస్తున్నారు. ఈ కల్లును తాగిన ప్రజలు కల్లు బానీసులగా మారుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

అనేక మందికి అనారోగ్యాలు

మంచి కల్లు తాగితే మనిషికి ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో నీరా అనేక ఆరోగ్యాలకు మేలని సైంటిస్టులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే కృత్రిమ కల్లు అనేక అనారోగ్యాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. కృత్రిమ కల్లులో రక్షిత మంచినీరు వాడకుండా శుభ్రమైన నీటిని వాడడం లేదు. కృత్రిమ కల్లులో బియ్యం పండి సిహెచ్,ఆల్ఫాజోలం, చాకిరిన్ వాడుతున్నారు. ఇందులో ఏ మోతాదు ఎక్కువైనా ప్రమాదమే. అయితే కల్లులో సిహెచ్‌ను వాడకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఇక్కడ మాత్రం పెద్ద మొత్తంలో సిహెచ్‌ను,ఆల్పాజోలంను కలుపుతున్నారు. దీంతో ఈ కల్లును సేవించిన ప్రజలు ముఖ్యంగా పేదలు కిడ్నీ, లివర్,గుండెజబ్బులు,డయాబెటిక్ వ్యాదుల బారిన పడుతున్నట్లు ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఈ కల్లు దందాను అరికట్టలేక పోతున్నారు. ఈ కల్లుకు బానీసలైన ప్రజలు ఒక్క రోజు ఈ కల్లు లేక పోతే పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తూ మతి స్దిమితం కోల్పోయి పిచ్చిపిచ్చగా ఉంటారని చెబుతున్నారు. వీరిని మార్చేందుకు ఎవరి తరం కాదు కూడాను. దీంతో ప్రతి గ్రామంలో పోటా పోటీగా కల్లు దుకాణాలు ఉంటాయి.

అధికారుల తనఖీలు నామ మాత్రమే

ఇక్కడ పెద్ద ఎత్తున కల్లు మాఫియా నడుస్తున్నా, కల్తీకల్లు వ్యాపారాలు జరుగుతున్నా సంబందిత అబ్కారి శాఖ అధికారులు చూసిచూడనట్లు ఉంటున్నారన్న చర్చ నడుస్తోంది. నెల మామూళ్లు ముడుపులు ముడుతున్నందునే వాటివైపు వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కూడా నార్కోటిక్ అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి చెక్ చేశారు తప్పితే ఇక్కడున్న అధికారులు ఎలాంటి తనఖీలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. కల్లు వ్యాపారం వెనుక రాజకీయ నేతల అండదండలు ఉండడంతో అబ్కారి అధికారులు మిన్నకుండిపోతున్నారు. కృత్రిమ కల్లుకు ఎంతమంది బలౌతున్నా వాటిని సాధారణ కేసులుగా పరిగణిస్తూ రాజకీయ నేతలకే జై కొడుతున్నారు. ఇటీవల నార్కోటిక్ అధికారులు కేసులు నమోదు చేసినప్పటికీ ఆ డాన్ తప్పించుకున్నట్లు చెబుతున్నారు. రాజకీయ నేతలే అయన్ను కాపాడారనే టాక్ గద్వాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికైనా కల్తీ కల్లును అరికట్టి పేదల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజా సంఘాలు, ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News