కెనడా లోని బ్రాంప్టన్ లో హిందూ ఆలయాన్ని లక్షంగా చేసుకుని ఖలిస్థానీలు మరోసారి భక్తులపై దాడులు చేశారు. దీనిని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ప్రతి కెనడా వాసికి తన నమ్మకం ప్రకారం స్వేచ్ఛగా, భద్రంగా మతాలను పాటించే హక్కు ఉందని, ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్రాంప్టన్ లోని ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. బ్రాంప్టన్‌లో హిందూ ఆలయంలో ఆదివారం ఖలిస్థాన్‌కు మద్దతుగా కొందరు బ్యానర్లతో ప్రదర్శనలు నిర్వహించడం ముష్టిఘాతాలకు పాల్పడుతుండడం ,
కొందరు కర్రలతో ఒకరి నొకరు బాదు కోవడం వీడియో వైరల్ అయిందని పీల్ రీజినల్ పోలీస్ చెప్పారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా నిరసన తెలిపే హక్కును తాము గౌరవిస్తామని, కానీ హింసాత్మక, నేరపూరిత చర్యలను ఉపేక్షించబోమని పీల్ రీజినల్ పోలీస్ ఆదివారం మధ్యాహ్నం హెచ్చరించారు. సామాజిక మీడియా గురించి తదుపరి వివరాలను పోలీస్‌లు వెల్లడించలేదు. ఏం జరిగిందీ, ఏవైనా ఫిర్యాదులు నమోదు చేశారా అన్నది వివరించలేదు. హిందూ సమాజాన్ని రక్షించడానికి స్థానిక అధికార యంత్రాంగం వేగంగా స్పందించడం , దర్యాప్తు చేపట్టడంపై జస్టిన్ ట్రూడో తన ఎక్స్ ఖాతాలో కృతజ్ఞతలు తెలిపారు.
ఒట్టావా లోని భారత హైకమిషన్ తీవ్ర ఆందోళన
ఈలోగా ఒట్టావా లోని భారత హై కమిషన్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ప్రకటించింది.బ్రాంప్టన్ లోని హిందూ ఆలయం వెలుపల నిర్వహిస్తోన్న కాన్సులర్ క్యాంప్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేయడం తీవ్ర నిరాశ పరిచిందని పేర్కొంది. హిందూ సభ మందిర్, భారత కాన్సులేట్ నిర్వహించే రాజ్యాంగ పరమైన విధులకు ప్రతిబంధక మవుతుందని వ్యాఖ్యానించింది. గతంలో మాదిరిగానే ఒట్టావా లోని హైకమిషన్, వాంకోవర్, టోరంటో లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సాధారణ కార్యకలాపాల నిమిత్తం క్యాంప్‌లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్టా భద్రత అందించాలని మేం ముందుగానే కెనడా అధికారులను అభ్యర్థించాం.
భారత వ్యతిరేక శక్తుల దాడితో మా క్యాంపు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది . భారత పౌరుల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. వాంకోవర్‌లో కూడా నవంబర్ 23 తేదీల్లో ఇదే తరహా యత్నాలు జరిగినప్పటికీ, మా కార్యకలాపాలు కొనసాగించగలిగాం” అరి హైకమిషన్ ఎక్స్ వేదికగా స్పందించింది. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ఈ హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండించారు. దీనికి బాధ్యులైన వారు చట్టప్రకారం శిక్షింపబడాలని సూచించారు. కెనడా విపక్ష నాయకుడు పియెర్రె పొయిలెవ్రే తోసహా రాజకీయ వర్గాలు కూడా ఈ సంఘటనను తీవ్రంగా విమర్శించాయి. వేగంగా స్పందించడంపై ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్ పోలీస్‌లను ప్రశంసించారు.
ఆరాధన క్షేత్రాలన్నిటికీ భద్రతకై డిమాండ్
కెనడా లోని ఆరాధన క్షేత్రాలన్నిటికీ ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా భద్రత కల్పించాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కెనడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారికి తగిన శిక్షపడుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.