బాలీవుడ్ నటి కంగనా రానౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం బ్రిటన్ లో థియేటర్లలో ప్రదర్శిస్తుండగా సిక్కుల నుంచి తీవ్ర నిరసలను వ్యక్తం అయ్యాయి. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 లో విధించిన ఎమర్జెన్సీ, అప్పటి పరిణామాలపై ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో నిరసనలు, అల్లర్లపై భారత విదేశాంగమంత్రిత్వశాఖ బ్రిటీష్ అధికారులను సంప్రదిస్తున్నారు. బ్రిటన్ లోని సిక్కు గ్రూప్ లు, సిక్ ప్రెస్ అసోసియేషన్ ఈ చిత్రం యాంటీ సిఖ్ చిత్రం అని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. బ్రిటన్ లోని పలు సినిమాహాళ్లలో ప్రదర్శిస్తున్న ఎమర్జెన్సీ చిత్రానికి ఆటంకం జరుగుతోందని వచ్చిన వార్తలు చూసినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికలో పేర్కొన్నారు. హింసాత్మక నిరసనలు, బెదిరింపు సంఘటనల పట్ల బ్రిటీష్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ నిరసనలు వాక్ స్వాతంత్య్రానికి భంగకరం అని భారత ప్రభుత్వం భావిస్తోంది.
ఈ చిత్రాన్ని అడ్డుకుంటున్న వారిపై బ్రిటీష్ ప్రభుత్వం చర్య తీసుకోవాలని భావిస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు. భారతీయుల భద్రత పట్ల లండన్ లోని భారత హైకమిషన్, బ్రిటీష్ ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ, తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిరసన కారులను పట్టి బంధించి, బాధ్యులను చేయాలని ఆయన సూచించారు. వాయవ్య లండన్ లో మాస్క్ ధరించిన ఖలిస్తాన్ టెర్రరిస్ట్ లు థియేటర్లలో హల్ చల్ చేసినట్లు, థియేటర్ల యజమానులను బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. ఆదివారం, హారో వ్యూ సినిమాలో ’ఎమర్జెన్సీ’ చిత్రం ప్రదర్శన మొదలై 30-40 నిముషాల తర్వాత ముసుగు ధరించిన ఖలిస్తానీ టెర్రరిస్ట్ లు థియేటర్ లోకి దూసుకువచ్చి , ప్రేక్షకులను బెదిరించి, నానా అల్లరీ చేసి, చిత్రం స్క్రీనింగ్ నిలిపివేసేలా చేశారని కన్సర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ బాబ్ బ్లాక్ మాన్ తెలిపారు. వోల్వర్హాంప్టన్, బర్మింగ్హామ్ , మాంచెస్టర్ లలోని థియేటర్లలో నూ ఇదే పరిస్థితి ఎదురైంది. కంగనా రౌనత్ ఎమర్జెన్సీ చిత్రం నిర్మాతలలో ఒకరు. ఈ చిత్రంలో సిక్కు కమ్యునిటీ ని తప్పుగా చూపడం ద్వారా, చరిత్రను తప్పుదోవ పట్టించారని సిక్కు సంఘాలు ఆరోపించాయి.