కెనడాలోని హిందువులు తమ మతవిశ్వాసాలను సురక్షితంగా పాటించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇండో -కెనడా సమాజం లేకపోతే కెనడాలో దీపావళి సంబరాలు లేవు’- మొన్న దీపావళి పండుగ సందర్భంగా ఓ హిందూ దేవాలయాన్ని సందర్శించిన అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలివి. ఇది జరిగిన మూడు రోజులకే బ్రాంప్టన్ లోని హిందూ దేవాలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి చేసి, పలువురు భక్తులను గాయపరిచారు.
ఈ సంఘటన కెనడాలో నివాసం ఉంటున్న హిందువులపట్ల, వారి ప్రార్థనా మందిరాల రక్షణ పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లం చేస్తోంది. అంతకుమించి, హిందువులపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్న ప్రధాని ట్రూడో మాటలకు, చేతలకు పొంతన లేదని రుజువు చేస్తోంది. టొరంటోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయం పై సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలను చేతపట్టి సృష్టించిన విధ్వంసం సభ్యసమాజాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఆమాటకొస్తే, ఖలిస్థానీ వేర్పాటువాదులు అక్కడి హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగిన దాఖలాలు ఉన్నా ఆలయాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడంలో ట్రూడో నేతృత్వంలోని ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం వహిస్తున్నారనడానికి తాజా ఉదంతమే ఉదాహరణ.
భారత రాయబార కార్యాలయం బ్రాంప్టన్ ఆలయంలో ఏర్పాటు చేసుకున్న సమావేశాన్ని విచ్ఛిన్నం చేయడం, హిందూ భక్తులలో భయాందోళనలు రేకెత్తించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిని ఖండించిన ప్రధాని ట్రూడో సంఘటనకు సంబంధించిన బాధ్యుల గురించి గానీ, అరెస్టుల గురించి గానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఖలిస్థానీ వేర్పాటువాదులకు ప్రభుత్వం ఇచ్చిన అపారమైన స్వేచ్ఛ కారణంగానే ఈ దాడి జరిగిందంటూ హిందూ ఎంపి చంద్ర ఆర్య మండిపడ్డారు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ దాడే ఒక ఉదాహరణ అంటూ దాడికి సంబంధించిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ దాడి వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందంటూ ఒట్టావాలోని భారత రాయబారి కార్యాలయం సైతం ఆరోపించింది.
జరిగిన సంఘటనను భారత ప్రధాని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ, కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ దేశంలో అధిక సంఖ్యలో ఉన్న సిక్కుల మద్దతు కోసం ట్రూడో పాకులాడుతున్నారు. గత మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న లిబరల్ పార్టీని ఇటీవలి కాలంలో వరుస వివాదాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజ్జర్ హత్య కేసులో ఇండియాతో కోరి తెచ్చుకున్న వివాదంలో సాక్ష్యాలు చూపించలేక ట్రూడో ప్రభుత్వం నీళ్లునములుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు గోరుచుట్టుపై రోకటిపోటులా సిక్కులకు చెందిన న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డిపి) సంకీర్ణ ప్రభుత్వానికి ఇటీవల మద్దతు ఉపసంహరించుకుంది.
అయితే ముందే కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలవరకూ అధికార లిబరల్ పార్టీకి మద్దతు ఇస్తామన్న తమ ఒప్పందాన్ని గౌరవిస్తూ, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోమని ఎన్‌డిపి అధినేత జగ్మీత్ సింగ్ హామీ ఇవ్వడంతో ట్రూడో ఊపిరి పీల్చుకున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇళ్ల సమస్య వంటివి అధికార పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. వచ్చే ఏడాది అక్టోబర్లో జరిగే ఎన్నికల్లో లిబరల్ పార్టీ గట్టెక్కడం కష్టమేనంటూ సర్వేలు ఘోషిస్తున్న తరుణం లో సిక్కులను మచ్చిక చేసుకునేందుకు సందర్భం వచ్చినప్పుడల్లా భారత ప్రభుత్వంపై ట్రూడో విషం కక్కుతున్నారు. ఒక క్రిమినల్ కేసులో భారత హై కమిషనర్‌కు ప్రమేయం ఉందని నిరూపించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధపడటంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇది చాలదన్నట్లు తాజాగా తమ దేశానికి ఇండియా నుంచి సైబర్ దాడుల ముప్పు ఉందంటూ కెనడా కొత్త పల్లవి ఎత్తుకుంది. భారత ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదని జాతీయ సైబర్ ముప్పుపై వెలువరించిన ఓ అధ్యయనం పేర్కొనడాన్ని చేతికి అంది వచ్చిన ఆయుధంగా ట్రూడో భావిస్తున్నారు. ఆధారాలు లేకుండా ఇండియాపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న కెనడా, భారత్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని మార్చేందుకు పడరాని పాట్లు పడుతోంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అతివాద శక్తులను వెనకేసుకు వస్తున్న జస్టిన్ ట్రూడో వైఖరిలో మార్పు రాకపోతే, భారత -కెనడా సంబంధాలు మరింతగా విషమించే ప్రమాదముంది.