Saturday, December 21, 2024

ఖలిస్థానీ తీవ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ ఆస్తులు సీజ్ చేసిన ఎన్‌ఐఎ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కెనడా-భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ .. కెనడా లోని హిందువులకు వార్నింగ్ ఇచ్చిన వేర్పాటు వాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పంజాబ్ లోని అతడి ఇల్లు, భూమిని జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. అమృత్‌సర్ శివారు లోని పన్నూ పూర్వీకుల గ్రామమైన ఖాంకోట్‌లో ఉన్న దాదాపు ఆరు ఎకరాల భూమిని, చండీగఢ్ లోని ఇంటిని దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత చర్యతో అతడు తన ఆస్తులపై హక్కుల్ని కోల్పోయాడు. ప్రస్తుతం వాటిని ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు. 2020లో దర్యాప్తు సంస్థలు అతడి ఆస్తుల్ని అటాచ్ చేశాయి. అతడు విక్రయించడానికి వీల్లేదని దానర్ధం.

వివిధ దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వేర్పాటువాద సంస్థలపై తీసుకుంటోన్న చర్యలకు ప్రస్తుత పరిణామం మరింత బలం చేకూరుస్తోందని ఎన్‌ఐఎ తన ప్రకటనలో పేర్కొంది. సిఖ్ ఫర్‌జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె) అనే వేర్పాటు వాద సంస్థను భారత్ 2019 లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా, వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా కెనడా లో జరుగుతోన్న పరిణామాలపై పన్నూ స్పందించారు. కెనడా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇండో కెనడియన్ హిందువులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన అతడు, అటువంటి వారు తిరిగి భారత్ వెళ్లిపోవాలని బెదిరించాడు. పన్నూ బెదిరింపులపై కెనడాలో హిందూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News