ఛండీగఢ్: డ్రగ్స్ బానిసగా మారిన ఓ వ్యక్తి అన్న కుటుంబాన్ని హత్య చేసిన సంఘటన పంజాబ్‌లోని మొహాలీ ప్రాంతం ఖరర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హర్లల్‌పూర్ గ్రామంలోనే గ్లోబల్ సిటీ కాలనీలో లఖ్వీర్ సింగ్, సత్వీర్ సింగ్ అనే అన్నదమ్ములు నివసిస్తున్నారు. సత్వీర్ సింగ్‌కు భార్య అమన్‌దీప్ కౌర్, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. తమ్ముడు లఖ్వీర్ సింగ్ గత కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసగా మారాడు. దీంతో సత్వీర్ సింగ్ తన తమ్ముడిని సంపాదించాలని పలుమార్లు కోరాడు. దీంతో తన అన్న కుటుంబాన్ని అంతం చేయాలని తమ్ముడు నిర్ణయించుకున్నాడు. గురుప్రీత్ సింగ్ బంటీ అనే వ్యక్తితో కలిసి లఖ్వీర్ సింగ్ తొలుత వదిన అమన్‌దీప్ కౌర్‌ను గొంతు నులిమి హత్య చేసి రెండేళ్ల కుమారుడిని కూడా చంపేశారు. అనంతరం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత సత్వీర్ సింగ్‌ను చంపేశారు.
రోపర్ గ్రామ శివారులోని కాలువలో రెండు మృతదేహాలను పడేశారు. హత్య చేయకముందే సిసిటివి ఫుటేజీ, డివిఆర్‌లను ఆఫ్ చేశారు. ఖనోరి గ్రామంలో రెండు మృతదేహాలు కాలువలో కనిపించడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కొంచెందూరంలో రెండేళ్ల బాబు మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను గుర్తించారు. అనంతరం సోదరుడు లఖ్వీర్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. తాను డ్రగ్స్‌కు బానిసగా మారడంతో పాటు డబ్బులు సంపాదించడంలేదని తనను వదిన, అన్న అవహేళన చేయడంతో హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.