సాసారామ్ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విపక్ష నేతలను ఉద్దేశించి చేసిన ‘ముజ్రా ’ డాన్స్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీహార్ ప్రజలను మోడీ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత, మహాఘట్ బంధన్ అభ్యర్థి మనోజ్‌కుమార్ తరఫున బీహార్ లోని సాసారామ్ లోక్‌సభ నియోజక వర్గంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే మాట్లాడుతూ , ముజ్రా డాన్స్ ఇక్కడే జరిగినట్టు ప్రధాని మాట్లాడడం బీహార్ ప్రజలను మోడీ అవమానించడమేనని వ్యాఖ్యానించారు.
శుక్రవారం నాడు బీహార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ముజ్రా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తనను తాను ఒక మాస్టర్ (తీస్మార్‌ఖాన్ ) అనుకుంటున్నారని, చాలా తప్పుడు అభిప్రాయంలో ఆయన ఉన్నారని, ప్రజలే మాస్టర్లని, ఆయన ఒక నియంత అని ఖర్గే విమర్శలు గుప్పించారు. మోడీ మూడోసారి ప్రధాన మంత్రి అయితే ప్రజల గొంతు అణచి వేస్తారని హెచ్చరించారు. ఈ ఎన్నికలు ప్రజలకు , మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, రాహుల్‌కు మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఎంతమాత్రం కావని, ఖర్గే తెలిపారు. ప్రధాని సంపన్నులను అక్కున చేర్చుకుంటారే కానీ పేద ప్రజలను కాదని అన్నారు. బీహార్ లోని సాసారామ్ , నలందా, పాట్నా, సాహిబ్, పాటలీపుత్ర , ఆగ్రా, బక్సర్, కరకాట్, జెహ్నాబాద్ లోక్‌సభ నియోజక వర్గాల్లో జూన్ 1న ఏడవ విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరగనుంది.