న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించిన స్వాతంత్య్ర వేడుకలకు కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గైర్హాజరయ్యారు. కళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలు తనకు ఏర్పడ్డాయని, అలాగే ప్రొటోకాల్, భద్రతాపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయని, అందుకే తాను ఆ ఉత్సవానికి హాజరుకాలేదని ఖర్గే తెలిపారు. ఎర్రకోట వద్ద వివిఐపిల కోసం కేటాయించిన గ్యాలరీలో ఖర్గే కోసం రిజర్వ్ చేసిన సీటు ఖాళీగా ఉండడం కనిపించింది.
కాగా..తన అధికారిక నివాసంతోపాటు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతోసహా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎర్రకోట వద్ద ప్రధాని మోడీ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా తనకు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని, దాంతోపాటు ప్రొటోకాల్ ప్రకారం తన ఇంటి వద్ద ఉదయం 9.20 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించవలసి ఉందని, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించ వలసి ఉన్నదని ఆయన వివరించారు.
ఎర్ర కోట వద్ద భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుందని, ప్రధాని, ఇతర మంత్రులు బయల్దేరిన తర్వాత ఇతరులను వెలుపలకు అనుమతిస్తారని, సకాలంలో అక్కడకు చేరుకోలేను కాబట్టే అక్కడకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని ఖర్గే తెలిపారు.