Wednesday, January 22, 2025

వేడుకలకు హాజరు కాని ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎర్రకోటపై జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దాంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా కనిపించింది. విమర్శలు రావడంతో ఖర్గే స్పందించారు. భద్రతా పరమైన ఆంక్షల వల్లే ఎర్రకోట వేడుకలకు హాజరుకాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను అక్కడికి వెళ్లాల్సి ఉంటే కాంగ్రెస్ కార్యాలయంలో జరగాల్సిన వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చేదన్నారు. తనకు కాస్త కంటి సమస్య కూడా ఉందన్నారు. ఎర్రకోటకు వెళ్లాలంటే ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని, స్పీకర్, రక్షణమంత్రి వెళ్లిన తర్వాతే తాను వెళ్లాల్సి ఉంటుందని, అప్పటి వరకు సమయం సరిపోదన్న ఉద్దేశంతో హాజరుకాలేదని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా భద్రతా పరమైన ఆంక్షలు కూడా అందులో ఒక కారణమని వివరణ ఇచ్చారు.

అయితే తన నివాసంతో పాటు కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు ఖర్గే హాజరయ్యారు. ఒక సందేశాన్ని పంపారు. ప్రధాని మోడీ, బిజెపిని ఉద్దేశించి విమర్శనాత్మకంగా స్పందించారు. ఖర్గే తన వీడియో సందేశంలో దేశ ప్రగతి కోసం మాజీ ప్రధానులు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతోపాటు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ పేర్లను ప్రస్తావించారు. అంతేగాకుండా బిజెపి దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరును తన సందేశంలో పేర్కొనడం గమనార్హం. ఈ దేశం కోసం పనిచేసిన ప్రతి ప్రధాని దేశ పురోగతికి తమవంతు సహకారాన్ని అందించారని, అభివృద్ధి కోసం తమవంతు పాటుపడ్డారన్నారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచే దేశం ప్రగతి పథంలో వెళ్తుందని కొందరు వ్యక్తులు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా మోడీని ఉద్దేశించి పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు ప్రమాదంలో ఉన్నాయని ఎంతో బాధతో చెప్తున్నానన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకు కొత్త సాధనాలు ఉపయోగిస్తున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా బలహీనపరుస్తున్నారని ఇటీవలి పరిణామాలను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే గైర్హాజరుపై బిజెపి విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ వైఖరికి ఇది అద్దం పడుతోందని దుయ్యబట్టింది. ఎర్రకోట వేడుకలకు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కూడా గైర్హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News