Monday, December 23, 2024

జెకె కథువాలో ప్రసంగం మధ్యలో ఖర్గేకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

చికిత్స తరువాత తిరిగి ప్రసంగం
ప్రధాని మోడీని తొలగించే లోపు చావబోనన్న కాంగ్రెస్ చీఫ్

జస్రోటా/జమ్మూ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని జస్రోటా ప్రాంతంలో ఒక బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వైద్య చికిత్స అనంతరం ఖర్గే తిరిగి ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీని అధికారంలో నుంచి తొలగించేలోగా తాను చావబోవడం లేదని అన్నారు. వైద్యులు పరీక్షించిన తరువాత ఖర్గే ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కథువాలో ఉగ్రవాదులతో కాల్పుల పోరులో మరణించిన ఒక హెడ్ కానిస్టేబుల్‌కు నివాళి అర్పిస్తుండగా ఖర్గే అస్వస్థతకు గురయ్యారు.

ఆ ఘటనలో మరి ఇద్దరు పోలీస్ సిబ్బంది గాయపడగా, ఒక ఉగ్రవాది హతుడయ్యాడు. ‘ఆయన జస్రోటాలో ఒక బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తుండగా కళ్లు తిరిగినట్లుయింది. ఆయన సహచరులు ఆయనను ఒక కుర్చీలో కూర్చోబెట్టారు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులామ్ అహ్మద్ మీర్ ‘పిటిఐ’తో చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుని పరిస్థితి నిలకడగా ఉందని మీర్ తెలిపారు. ర్యాలీ వేదిక వద్ద వైద్య చికిత్స అనంతరం ఖర్గే మాట్లాడుతూ, ‘నాకు 83 ఏళ్లు, నేను అంత త్వరగా చావబోవడం లేదు. ప్రధాని మోడీని అధికారంలో నుంచి తొలగించేంత వరకు నేను జీవించే ఉంటాను’ అని చెప్పారు.

‘నేను మాట్లాడాలని అనుకున్నాను. కాని కళ్లు తిరిగినట్లు అవడంతో నేను కూర్చుండిపోయాను. దయచేసి నన్ను క్షమించండి’ అని ఖర్గే అన్నారు. ఖర్గే ఆ తరువాత కాంగ్రెస్ ప్రధానుల పాత్ర గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ, ‘బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించింది ఎవరు? ఇందిరా గాంధీ ఆ పని చేశారు. ‘జై జవాన్ జై కిసాన్’ నినాదాన్ని మనకు ఇచ్చారు. పాకిస్తాన్ మన చేతిలో ఓడిపోయింది. లాల్ బహదూర్‌శాస్త్రి ఆ దేశాన్ని ఓడించారు. ఇది కాంగ్రెస్’ అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు సమీకరణ నిమిత్తం ఒక ర్యాలీలో ప్రసంగించేందుకు జస్రోటాకు ఖర్గే చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News