Tuesday, December 17, 2024

ప్రధాని భగవంతుడేమీ కాదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై రూల్167 కింద చర్చ జరగాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు గురువారం ప్రతిపాదించాయి. ఈ అంశంపై రూల్ 267 కింద చర్చ జరగాలని పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచీ విపక్షాలు పట్టుబడుతూ ఉన్న విషయం తెలిసిందే. ఈ నిబంధన కింద చర్చ జరిగేటప్పుడు ఓటింగ్ జరగాల్సి ఉండడంతో పాటుగా ప్రధానమంత్రి చర్చకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే అధికార పక్షం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చను మాత్రమే అంగీకరిస్తామని చెప్తూ ఉండడంతో ప్రతి రోజూ సమావేశాలకు ఆటంకం ఏర్పడుతూ వస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఈ రెండూ కాకుండా వేరే నిబంధన కింద చర్చకు అంగీకరిస్తామని కొద్ది రోజుల కింద ప్రభుత్వానికి తెలియజేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ రోజు రూల్ 167కింద చర్చకు అనుమతించాలని,

అయితే చర్చ జరిగే సమయంలో ప్రధాని సభలో ఉండాలని స్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ను కోరారు. అయితే ప్రధాని సభకు హాజరు కావాలనే డిమాండ్‌ను అధికార పక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఖర్గే బిజెపి ఎంపిలపై మండిపడ్డారు.‘ ప్రధానమంత్రి రావడం వల్ల ఏమవుతుంది? ఆయన ఏమైనా పరమాత్ముడా?ఆయన భగవంతుడేమీ కాదు’ అంటూ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార, పక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అంతకు ముందు అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సభలో ప్రతిష్టంభనకు కారణం మీరంటే మీరని నినాదాలు చేసుకున్నారు. కాగా 267 నిబంధన కింద మణిపూర్ అంశంపై సభలో చర్చించాలంటూ విపక్షాలు ఇచ్చిన నోటీసులను అంతకు ముందు ధన్‌కర్ తిరస్కరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News