Wednesday, January 22, 2025

ఇది ఒక వ్యక్తి అహంకారం : ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై ప్రధాని నరేంద్ర మోడీ దాడిని కాంగ్రెస్ పార్టీ గురువారం మరింత తీవ్రం చేసింది. ఒక వ్యక్తి అహంకారం , తనను అందరూ గొప్పగా చెప్పుకోవాలన్న కోరిక దేశ తొలి గిరిజన మహిళా అధ్యక్షురాలికి పార్లమెంటు కాంప్లెక్స్‌ను ప్రారంభించడానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు దక్కకుండా చేసిందని దుయ్యబట్టింది. మోడీ ప్రభుత్వం అహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.‘మిస్టర్ మోడీ, పార్లమెంటు ప్రజలు ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య దేవాలయం, రాష్ట్రపతి కార్యాలయం పార్లమెంటులో ప్రథమ భాగం. మీ ప్రభుత్వం తలబిరుసుతనం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసింది’ అని గురువారం హిందీలో చేసిన ట్వీట్‌లో ఖర్గే విమర్శించారు.

పార్లమెంటు భవనాన్ని ప్రారంభించేందుకు భారత రాష్ట్రపతికి ఉన్న హక్కును లాగేసుకోవడం ద్వారా ఈ దేశానికి మీరేం చూపించదలచుకున్నారో 140 కోట్ల ప్రజలు తెలుసుకోవాలనుకొంటున్నారని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేత జరిగే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్‌తో పాటుగా 20 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ తీరుపై ఈ స్థాయిలో దాడి చేయడం గమనార్హం. కాగా ‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాంచీలో జార్ఖండ్ హైకోర్టు కాంప్లెక్స్‌లో దేశంలోని అతి పెద్ద జ్యుడీషియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.

ఒక వ్యక్తి అహంకారం , తనను తాను ప్రమోట్ చేసుకోవాలన్న కోరిక దేశ తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతికి న్యూఢిల్లీలో ఈ నెల 28న కొత్త పార్లమెంపట భవనాన్ని ప్రారంభించడానికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కును లేకుండా చేసింది’ అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మరో ట్వీట్‌లో దుయ్యబట్టారు. ‘అశోక ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, మోడీ ది ఇనాగ్యురేట్’ అని ఆయన ఆ ట్వీట్‌లో వ్యంగ్యంగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News